సాక్షి, బెంగుళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల బెంగుళూరు పర్యటన ముగిసింది. వివిధ రంగాల వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో గురువారం సాయంత్రం సమావేశమైన అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
‘మిషన్ 150’ విజయం సాధించాలి..
అంతకుముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు బీజేపీ ముఖ్యనేతలు, నిపుణులు, కార్యకర్తలతో షా విడివిడిగా భేటి అయ్యారు. కర్ణాటకలో బీజేపీ ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉందనే విషయంపై చర్చించారు. గతంలో కంటే సీట్ల సంఖ్య పెంచుకోవడంపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు గెలుపొందడమే లక్ష్యంగా పనిచేయాలనీ.. ‘మిషన్ 150’ విజయవంతమవ్వాలని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా బెంగుళూరులోని 28 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ విజయం సాధించేలా పనిచేయాలని నేతలకు తెలియజెప్పారు. అలాగే, బెల్గావీలోని 18 అసెంబ్లీ స్థానాల్లో 15 గెలుపొందేలా ప్రణాళికలు రచించాలన్నారు. బెంగుళూరు నగరంలో పార్టీకి కింది స్థాయిలో మంచి కార్యవర్గం ఉందనీ.. అక్కడ ఉన్న అన్ని సీట్లని గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment