సాక్షి, హైదరాబాద్: కేవలం నాలుగు సీట్లు గెలవడం కోసం ప్రతిపక్ష పార్టీలు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో మంత్రి హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అమరావతి నుంచి వచ్చిన స్క్రిప్టును చదివారని విమర్శించారు. టీడీపీకి కట్టుబానిసలమని ఉత్తమ్ రుజువు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్‌రావు తో కలిసి కర్నె గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘హరీశ్‌రావు సంధించిన 12 ప్రశ్నలపై ఉత్తమ్ డొంక తిరుగుడు సమాధానమిచ్చారు. నదీ జలాల పంపకంపై ఉత్తమ్ కు కనీస అవగాహన లేదని తేలిపోయింది. సైన్యం లో కెప్టెన్‌గా పనిచేశానని చెప్పుకునే ఉత్తమ్‌కు కనీస పరిజ్ఞానం లేదు. నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఉన్నతస్థాయి కమిటీ ఉంది. ఆ కమిటీ ముందు చంద్రబాబు తెలంగాణ నీటి కేటాయింపులకు ససేమిరా అన్నారు.
ఉత్తమ్ రాష్ట్ర ప్రయోజనాలను తాక ట్టు పెట్టి చంద్రబాబుకు వత్తాసు పలికాడు. అన్ని అనుమతులున్న సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని బాబుకు తాకట్టు పెట్టే కుతంత్రాల కూటమే మహాకూటమి. తెలంగాణ ప్రజలు మహాకూటమికి సరైన సమాధానం చెబుతారు. ప్రజలకు మహాకూటమి ప్రాతిపదిక లు చెప్పాలి. హరీశ్‌రావు 12 ప్రశ్నలు ఏమున్నాయో చదవకుం డానే అమరావతి ఆదేశాలతో ఉత్తమ్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఎంత వ్యతిరేకించినా దామరచర్ల ప్లాంట్ కట్టి తీరుతాం’అని అన్నారు.
పోలింగ్ కేంద్రాలు పెట్టాలి: టీఆర్‌ఎస్
ఇటీవల గ్రామపంచాయతీలుగా మారిన తండాలు, గిరిజన గూడేల్లో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ కోరింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములునాయక్ ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment