
సాక్షి, హైదరాబాద్: ప్రగతి నివేదన సభకోసం తాము పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటే, డబ్బాల్లో పెట్టి కోటి రూపాయలు ఇచ్చారని అనడానికి కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి బుద్ధి ఉండాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మరో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, పార్టీ నేత గట్టు రాంచందర్‌రావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. డబ్బులు పంచే అలవాటు కాంగ్రెస్ నేతలకే ఉందని వ్యాఖ్యానించారు.
గత ఎన్నికలలో పంచేందుకు తీసుకెళ్లిన డబ్బులు బయటపడడంతో టాటాసఫారీ వాహనంలో కాల్చేసిన చరిత్ర ఉత్తమ్‌ది అయితే, నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ పట్టుబడింది రేవంత్‌రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా నేతలు నోరు అదుపులో పెట్టుకుని గాలి మాటలు మాట్లాడడం మానేయాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ, గత నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందుంచి రానున్న రోజుల్లో ఏం చేస్తామో చెప్పేందుకే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇది దేశంలోనే పెద్ద సభ అవుతుందని, ఈ సభ ద్వారా టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ, శక్తి ఏంటో నిరూపిస్తామని వ్యాఖ్యానించారు. గట్టు మాట్లాడుతూ ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని, ఆ రోజున ఏ పనులున్నా వాయిదా వేసుకోవాలని కోరారు.