
సాక్షి, నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ సంక్షేమంపై సీఎం చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు. బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్ గ్రామంలో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ సమావేశాల్లో టీఆర్‌ఎస్ అనుసరించనున్న వైఖరిపై, ప్రస్తుత రాజకీయా పరిణామాలపై ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్వీప్ చేసిందని.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేసారు. కేంద్రం ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్‌పై పెద్దగా ఆశలు లేవని.. తెలంగాణకు రావాల్సిన నిధులకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు.
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ తగ్గిపోతుందని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరగడం లేదని వ్యాఖ్యానించారు. అందువల్ల జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషించనున్నాయని.. అందుకోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. కేసీఆర్ ఫ్రంట్‌పై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీయే ముద్దు అని చంద్రబాబు అన్న మాటను గుర్తుచేశారు. నాలుగేళ్లుగా దేశానికి బీజేపీనే అవసరమని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు స్వార్ధం కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆదరణ కోల్పోయిన చంద్రబాబు టెన్షన్‌లో ఉన్నారని తెలిపారు. తెలంగాణ క్యాబినేట్‌పై ఎదురైన ప్రశ్నపై స్పందించిన ఆమె.. తగిన సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment