సాక్షి, హైదరాబాద్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు లోక్‌సభ ఎన్నికల విషయంలోనూ అదే పం థాను అనుసరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా పార్టీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులపై స్పష్టత ఇస్తున్నారు. ఈ నెల 20న సిద్దిపేటలో నిర్వహించిన టీఆర్‌ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ ప్రసం గిస్తూ మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డిని 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరా రు.
శుక్రవారం మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార సభల్లో మహబూబాబాద్ ఎంపీగా అజ్మీరా సీతారాం నాయక్‌ను 4–5 లక్షల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇలా రెండు లోక్‌సభ స్థానాలపై కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. తద్వారా లోక్‌సభ ఎన్నికల్లోనూ సిట్టింగ్‌లకు కచ్చితంగా టికెట్లు లభిస్తాయనే భరోసా ను ఆయా నేతల్లో కల్పిస్తున్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేలా లోక్‌సభ సభ్యులు పూర్తిస్థాయిలో పని చేస్తారనే వ్యూహంతోనే కేసీఆర్ ముందుగానే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ముగ్గురు మినహా...
గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 11 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం మెదక్ ఎంపీగా కేసీఆర్ రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ), చామకూర మల్లారెడ్డి (టీడీపీ) టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇద్దరు లోక్‌సభ సభ్యులకు పోటీ చేసే అవకాశం కల్పించింది.
పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డిని మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దింపింది. టీఆర్‌ఎస్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో 90 శాతం మంది సిట్టింగ్‌లకు పోటీ చేసే అవకాశం కల్పించిన తరహాలోనే పార్టీలోని మిగిలిన ఎంపీలకు కూడా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించేలా కేసీఆర్ వరుసగా ప్రకటనలు చేయనున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ తర్వాతే టీఆర్‌ఎస్ మేనిఫెస్టో
అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో వెల్లడిపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాతే టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేయాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసింది. శనివారం ఈ ముసాయిదాను కేసీఆర్‌కు సమర్పించాలని ముందుగా నిర్ణయించింది. అయి తే ఈ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలోనే ముసాయిదా ను కేసీఆర్‌కు సమర్పించనున్నట్లు తెలిసింది. కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం ఆదివారం నుంచి మొదలవుతోంది. ఈ నెల 28 వరకు వరుస షెడ్యూల్ ఇప్పటికే సిద్ధమైంది. దీంతో ఆలోపు మేనిఫెస్టో వెల్లడయ్యే అవకాశం లేదని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా మేనిఫెస్టోలోని కీలక విషయాలను కేసీఆర్ ఇప్పటికే వెల్లడించారు. అక్టోబర్ 16న పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. రూ.లక్ష రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రైతు బంధు సాయం రూ.10 వేలకు పెంచడం, ఆసరా పింఛన్ల మొత్తం రెట్టింపు వంటి కీలక హామీలను వెల్లడించారు. అనంతరం ప్రచారంలో భాగంగా పలు హామీలను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపును ప్రచార సభలోనే ప్రకటించారు. మేనిఫె స్టోను వెల్లడించకుండా ఒక్కొక్కటిగా ప్రచారం లోనే చెప్పాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలి సింది. కాంగ్రెస్ మేనిఫెస్టో వెల్లడించిన తర్వాతే పూర్తి స్థాయిలో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment