
సాక్షి, ఖమ్మం జిల్లా : లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు. ఆయన స్వయంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారా? పోటీ చేసి గెలిచినపక్షంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. కేంద్ర రాజకీయాల్లోకి వెళుతారా? ఇలాంటి అనేక ఆసక్తికర ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీఆర్‌ఎస్ నేత పిడమర్తి రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సత్తుపల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయాల్సిందిగా కార్యకర్తల తరఫున తాము విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కేసీఆర్ పోటీ చేయకపోతే ఆయన ఎవరు పేరు ప్రకటిస్తే.. వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి లేదా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులలో ఒకరిని ఖమ్మం సీటు నుంచి నిలబెట్టే అవకాశముందని, వారిలో ఎవరిని టీఆర్‌ఎస్ తరఫున నిలబెట్టినా తాము మద్దతు ఇస్తామని పిడమర్తి రవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment