ఆశీర్వదించండి.. మళ్లీ వస్తున్నా | KCR Meeting At Husnabad Siddipet | Sakshi
Sakshi News home page

మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తాం.. తొలి ఎన్నికల సభలో కేసీఆర్‌

Published Sat, Sep 8 2018 1:02 AM | Last Updated on Sat, Sep 8 2018 2:20 PM

KCR Meeting At Husnabad Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట : రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రజలను కోరారు. ప్రభుత్వాన్ని రెన్యువల్‌ చేయిస్తే మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తానన్నారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరిట శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నుంచి కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. టీఆర్‌ఎస్‌ తొలి ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే...

కాంగ్రెస్‌వి ఆచరణ సాధ్యంకాని హామీలు...
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అత్యధిక కాలం కాంగ్రెస్‌ పార్టీయే దేశాన్ని పాలించింది. వారి పాలనలో తెలంగాణ రాష్ట్రమే కాదు.. దేశమంతా కరువు కాటకాలు, పేదరికంతో అలమటించింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నారు. మాయమాటలు చెబుతున్నారు. వారి మాటలు విని మోసపోతే ఐదు సంవత్సరాలు గోస పడుతాం. పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేశాం. లాఠీ దెబ్బలు తిన్నం.. జైళ్లకు వెళ్లాం.. చావు నోట్లోకి వెళ్లి వచ్చిన నేను పసిగుడ్డుగా ఉన్న తెలంగాణను నాలుగేళ్లలోనే అభివృద్ధి పథంలో నడిపించా.

వారు పట్టించుకుంటే తెలంగాణ వచ్చేదే కాదు..
ఢిల్లీ నాయకుల చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు అవాకులుచవాకులు మాట్లాడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో సీఎంలతో మాట్లాడాలంటేనే వారికి లాగులు తడిసేవి. వారు మన ప్రాంతం గురించి ఆలోచించి ఉంటే.. ఇక్కడ ప్రజల అవసరాలను పట్టించుకొని ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చేదే కాదు. ఇటువంటి ఢిల్లీకి వెళ్లి బిచ్చమెత్తుకునే కాంగ్రెస్‌ పాలకులు కావాలో.. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకునేలా టీఆర్‌ఎస్‌ పాలన కావాలో మీరే తేల్చుకోండి. అసలే అధికార వాంఛతో ఆకలితో ఉన్న కాంగ్రెస్‌ నాయకులకు రాష్ట్రాని అప్పగిస్తే పంటికి అందకుండా మింగేస్తారు.

చైనా, సింగపూర్‌లతో పోలిస్తే వెనుకబడ్డాం...
మన సరిహద్దు దేశమైన చైనాలో 2.23 లక్షల కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గం ఉంటే మన దేశంలో కేవలం 19 వేల కిలోమీటర్లు మాత్రమే రైలు మార్గం ఉండటం శోచనీయం. అంతర్జాతీయ స్థాయిలో సరుకులు రవాణా చేసే లారీల సగటు వేగం 80 కిలోమీటర్లు ఉండగా.. ఇండియాలో అది 24 కిలోమీటర్లే. అదేవిధంగా గూడ్స్‌ రైలు వేగం 86 కిలోమీటర్లు ఉంటే ఇండియాలో 36 కిలోమీటర్లు. దీనంతటికీ కాంగ్రెస్‌ అవినీతి పాలనే కారణం. కేవలం 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న సింగపూర్‌ ఏటా 5.70 కోట్ల కంటెయినర్లను డీల్‌ చేస్తోంది. కానీ 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న మన దేశం మాత్రం 47 లక్షల కంటెయినర్లనే డీల్‌ చేస్తోంది. ఇది సిగ్గుచేటు. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ కారణం కాదా? భగవంతుడు, ప్రకృతి ప్రసాదించిన నీటి వనరులు 70 వేల టీఎంసీలు ఉండగా.. వాటిని సద్వినియోగం చేసుకుంటే కరువు అన్న మాటే ఉండదు.

అభివృద్ధిలో వెనుకబడొద్దనే ముందస్తుకు...
తమ పాలనలో తెలంగాణ గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్‌ నాయకులు.. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే నోటికొచ్చినట్లు పేలుతున్నారు. నాలుగేళ్లలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి 17.17 శాతం ఉంది. ఈ ఏడాది అది 21.96 శాతానికి పెరిగిన విషయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది. దీన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధికి అడ్డు పడుతున్నారన్నారు. తరచూ విమర్శలు చేసే పార్టీలతో.. ప్రజల మధ్యకు వెళ్లి ఎవరేం చేశారో తేల్చుకుందామని అన్నప్పుడు సరే అన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇప్పుడు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు. దిక్కు తోచక ఆగమాగం అవుతున్నారు. మరో ఏడు నెలల పదవీ కాలం ఉన్నా.. రాష్ట్రంలో జరగనున్న అభివృద్ది ముందుకు పోవాలని, ఆర్థిక ప్రగతి 21.96 శాతానికి మించి ఎదగాలని భావించే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాం. అభివృద్ధి ఆగొద్దనే ఆలోచనతో పదవీకాలం త్యాగం చేశాం. మీరు ఆశీర్వదించి ప్రభుత్వాన్ని రెన్యూవల్‌ చేయిస్తే మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తాం. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తా.

చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టాం..  
పరాయి పాలనలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను నాలుగేళ్లలో చక్కబెట్టాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా గొల్లకురుమలు, చేనేత కార్మికులను ఆదుకున్నాం. అంగన్‌వాడీ, ఆశ వర్కర్లకు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచాం. ఎవరూ అడగకుండానే కల్యాణలక్ష్మి అమలు చేశాం. కాంగ్రెస్‌ నాయకులు కనీసం మహిళల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించలేదు. వాళ్ల హయాంలో ఆపరేషన్‌ లేకుండా ప్రసవాలు జరిగేవి కావు. కానీ ఇప్పుడు తల్లీబిడ్డల క్షేమానికి పథకాలు ప్రవేశపెట్టాం. ఎన్‌కౌంటర్లు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. రాష్ట్ర సంపదను హైదరాబాద్‌లో ఖర్చు పెట్టలేదు. కొత్త సంసారాన్ని ఎలా చక్కబెట్టుకుంటారో.. నోరు కట్టుకుని పైసా పైసా కూడబెట్టి పల్లెల సంక్షేమానికి వెచ్చించాం.

గులాబీ కండువా కప్పుకుంటావా జానారెడ్డీ?
రైతులకు ఉచితంగా 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రకటిస్తే ప్రతిపక్ష నేత జానారెడ్డి విమర్శలు చేశారు. మీరు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తే గులాబీ కండువా కప్పుకుంటామని సవాల్‌ చేశారు. ఇప్పుడు రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది నీకు కన్పిస్తలేదా.. జానారెడ్డి. కళ్లు కనిపించకపోతే రాష్ట్రమంతటా అమలవుతున్న కంటి వెలుగు పథకం కింద కంటి పరీక్షలు చేయించుకో. విద్యుత్‌ను ఎలా తీసుకురావాలో.. ఉత్పత్తి ఎలా పెంచాలో కాంగ్రెస్‌ నాయకులకు తెలియదు. తిరిగి వారికి ఓటు వేస్తే రాష్ట్రంలో కరెంట్‌ ఇబ్బందులు మళ్లీ వస్తాయి. తిరిగి హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా సతీష్‌ కుమార్‌ను గెలిపించి దీవించాలి. సభలో ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ ప్రసంగించారు.

ఈ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, బి. వెంకటేశ్వర్లు, ఫారూఖ్‌ హుస్సేన్, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ, కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌సింగ్, మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌రావు, పుట్ట మధు, చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, బొడిగ శోభ, బస్వరాజు సారయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, విద్యాసాగర్‌రావు, టూరిజం శాఖ చైర్మన్‌ భూపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఈదె శంకర్‌రెడ్డి, కర్ర శ్రీహరి, పేర్యాల రవీందర్‌రావు, రాధాకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement