
సాక్షి, హైదరాబాద్/భువనేశ్వర్: దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పుంజుకుంటోందని, ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల్ని ఒక తాటిపైకి తెచ్చే ఉద్యమం ప్రారంభమైందని సీఎం కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల్లో అద్భుత శక్తిగా వెలుగొందుతున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సంప్రదింపులు ప్రారంభించడంతో జాతీయ స్థాయిలో గుణాత్మక రాజకీయ శక్తి ఆవిష్కరణ ప్రక్రియకు బీజం పడిందని వ్యాఖ్యానించారు. సమాన ఆశ యాలు, కార్యాచరణతో విజయ పంథాలో కొనసాగుతున్న నవీన్.. తనతో ఏకీభవిస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని.. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తమ ప్రయత్నాలతో దేశానికి ప్రయోజనం కలగనుందని, సమీప భవిష్యత్తులో సత్ఫలిలొస్తాయని స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు ఆదివారం సీఎం కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’సంప్రదింపుల ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపారు. ప్రధాన రాజకీయ పార్టీల తరహాలో ప్రాంతీయ పార్టీల్లో వర్గ విబేధాలు లేవని ఇరువురు సీఎంలు ప్రకటించారు. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రజాహిత పథకాలు, కార్యాచరణ పట్ల ఇరువురు నాయకులు ఒకర్ని ఒకరు ప్రశంసించుకున్నారు.
పూజలతో తొలి అడుగు...
టీఆర్‌ఎస్ పార్టీ అవసరాల కోసం నెల రోజుల పాటు అద్దెకు తీసుకున్న ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం వెళ్లారు. అక్కడ శారదా పీఠాన్ని సందర్శించి రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకుని ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్లారు. సాయంత్రం 6.15 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆయన నివాసంలో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆదివారం రాత్రి ఒడిశా సీఎం అధికార నివాసంలోనే కేసీఆర్ బస చేశారు.
మళ్లీ కలుస్తాం: కేసీఆర్
నవీన్ పట్నాయక్‌తో జరిపిన చర్చల్లో రహస్యం ఏమీ లేదని కేసీఆర్ స్పష్టంచేశారు. గుణాత్మక మార్పు కోసం చర్చలు జరిపామని, తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడే నిర్దిష్టమైన ఫలితం రాదని, సమీప భవిష్యత్తులో వస్తుందని భావిస్తున్నామన్నారు. త్వరలో మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేస్తామని వెల్లడించారు. దేశంలోని మరింత మందితో చర్చించాల్సిన అవసరముందన్నారు. బీజేపీకి టీఆర్‌ఎస్.. బీ టీం అని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కేసీఆర్ తోసిపుచ్చారు. ఈ విషయంలో నవీన్ కూడా ఏకీభవించారని తెలిపారు. ఒడిశా ప్రజల కోసం, అక్కడి రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్న నవీన్ పట్నాయక్‌కు కేసీఆర్ అభినందనలు తెలిపారు. నవీన్ ఆదర్శనీయుడని, దేశంలో స్వప్రయోజనాలు ఎరగని రాజకీయ నేత అని కొనియాడారు. అత్యయిక పరిస్థితి విధించిన సమయంలో ఆయన చేసిన పోరాటం తనకు తెలుసన్నారు. ఇటీవల ఒడిశాలో తీసుకొచ్చిన వ్యవసాయ పాలసీని కేసీఆర్ మెచ్చుకున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా పట్ల నవీన్ పట్నాయక్ చూపుతున్న చొరవకు అభినందనలు తెలిపారు.
ఇంకా ఆ స్థాయికి రాలేదు: నవీన్ పట్నాయక్
జాతీయ, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కూటమిలో భాగస్వామ్యం, పురోగమనం వంటి అంశాలపై తాము చర్చించామని నవీన్ పట్నాయక్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న వ్యవసాయ విధానం బాగుందని, అందులోని కొన్ని ప్రగతిశీల అంశాలను తాము అమలు చేసే వ్యవసాయ విధానంలో చేర్చినట్లు వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై వైఖరి తెలపాలని విలేకరులు అడగ్గా.. చర్చలు ఇంకా అంతవరకు పురోగమించలేదని నవీన్ బదులిచ్చారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై సాధారణ చర్చ జరిపామని, చర్చలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఒకే ఆలోచన విధానం కలిగిన పక్షాల మధ్య స్నేహం కొనసాగింపుతో సహా చాలా అంశాలను చర్చించినట్టు వెల్లడించారు. ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు జగన్నాథస్వామికి కృతజ్ఞతలు తెలపడానికి కేసీఆర్ ఒడిశా వచ్చారని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
నేడు మమతతో భేటీ
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. తొలుత ఆయన కటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ దేవాలయానికి వెళతారు. తర్వాత జగన్నాథ దేవాలయాన్ని సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి ఢిల్లీ వెళ్తారు. 25వ తేదీ నుంచి రెండు, మూడు రోజులపాటు అక్కడే ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశమవుతారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తోనూ భేటీ అవుతారు. పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment