సాక్షి, హైదరాబాద్: నియంతృత్వ పాలనను ఇక తెలంగాణ సమాజం అంగీకరించబోదని, ఇక్కడ మార్పు ఖాయమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ మీడియా సెల్ నేతలు యతీశ్, ప్రశాంత్, ఏఐసీసీ సభ్యుడు ఫయీంలతో కలసి మీడియాతో మాట్లాడారు.
మరింత వేగంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, అయితే ప్రజలు ఆశిం చినా కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలన విషాదాన్నే మిగిల్చిందని దుయ్యబట్టారు. గత ఎన్నికల హామీ ల్లో ఒక్క దాన్ని కూడా నెరవేర్చని కేసీఆర్, మళ్లీ ఇప్పుడు ఎలా హామీలిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులున్నాయని, అందుకే కేసీఆర్ ముం దస్తు ఎన్నికలకు వెళ్లి బాధ్యతల నుంచి తప్పించుకున్నారన్నారు. అకారణంగా ప్రభుత్వాన్ని రద్దు చేసిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు.
మోసం చేసిన కేసీఆర్..
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ నమ్మిం చి మోసం చేశారని చవాన్ ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులే ఇసుక మాఫియా నడిపిస్తూ ప్రశ్నించిన నేరెళ్ల దళితులను చిత్రహింసలకు గురిచేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లు 10 వేలు కూడా దాటలేదని, లక్ష ఉద్యోగాలిస్తామని మాట తప్పారని విమర్శించారు.
‘హస్తం’ అధికారంలోకి వస్తే అందరికీ మేలు..
తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు చేస్తామని, ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చవాన్ చెప్పారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి స్థాయి మేనిఫెస్టోని విడుదల చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment