ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్/చెన్నై: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకన్నా ప్రాంతీయ పార్టీలే ఎక్కువ ఓట్లు సాధిస్తాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్న కేసీఆర్.. చెన్నైలో రెండోరోజు రాజ్యసభ సభ్యురాలు, డీఎంకే నాయకురాలు కనిమొళితో సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం సీఎం బస చేసిన ఐటీసీ చోళ హోటల్‌లో వీరిరువురి భేటీ జరిగింది. ఈ సందర్భంగా దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దాదాపు గంటపాటు చర్చించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే సమైక్య స్ఫూర్తి పరిఢవిల్లుతుందని కేసీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను కనిమొళి అభినందించారు.
దేశాభివృద్ధిలో రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు మరింత ఐక్యంగా పని చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, భూరికార్డుల ప్రక్షాళన, ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు పెట్టుబడి అందించే పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కనిమొళికి వివరించారు. త్వరలో హైదరాబాద్ వస్తానని, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టును చూస్తానని ఆమె ఈ సందర్భంగా సీఎంకు చెప్పారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బి.వినోద్‌కుమార్, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చెన్నై పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం డీఎంకే అధినేత కరుణానిధి, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే.
జాతీయ రాజకీయాలపై చర్చించాం..
కేసీఆర్‌తో భేటీ అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాలపై చర్చించామని, రానున్న సార్వత్రిక ఎన్నికలపై తాను కూడా ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. మరోవైపు కేసీఆర్‌తో వచ్చిన మంత్రులు బృందాలుగా ఏర్పడి సోమవారం ఉదయం చెన్నైలో పలు ప్రాంతాల్లో పర్యటించినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతోపాటు అధ్యయనం చేసినట్టు తెలిసింది.
రేపు అఖిలేష్ రాక?
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం హైదరాబాద్ రానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల పార్టీ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్లీనరీకి ఒక రోజు ముందే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లక్నోలో అఖిలేష్ యాదవ్‌ను కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment