లోక్‌సభ బాధ్యత మీదే! | KCR will play big role at Centre | Sakshi
Sakshi News home page

లోక్‌సభ బాధ్యత మీదే!

Published Thu, Mar 7 2019 4:22 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

KCR will play big role at Centre - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాల్లో గెలుపునకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేలా ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌లో సన్నాహక సమావేశాలు మొద లయ్యాయి. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఆధ్వర్యంలో ఈ సదస్సులు జరుగుతున్నాయి.

పార్టీ శ్రేణులు, నాయకులను ఎన్నికలకు సిద్ధం చేయడంతోపాటు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఎన్నికల వ్యూహం అమలుపై కేసీఆర్‌ పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. మంత్రులకు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహం అమలు బాధ్యతలను అప్పగించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో ఈ మేరకు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజులుగా తనను కలిసిన మంత్రులకు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులకు అప్పగిస్తున్నారు. నలుగురు మంత్రులకు ఏకంగా రెండు లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి మంత్రివర్గంలో స్వయంగా కేసీఆరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దీంతో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రచార వ్యూహాన్ని ముఖ్య మంత్రే పర్యవేక్షించనున్నట్లు తెలిసింది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు తీవ్రమైన ప్రతికూల ఫలితాలొచ్చాయి. పది అసెంబ్లీ స్థానాల్లో ఒక్క నియోజకవర్గంలోనే గెలిచింది.  16 ఎంపీ సీట్లను కచ్చితంగా గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్న కేసీఆర్‌ ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌ విషయంలో ప్రత్యేక వ్యూహం రూపొందించారు. ఖమ్మం లోక్‌సభ ఎన్నికల వ్యూహం అమలు బాధ్యతను కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. మంత్రులు గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డికి రెండు చొప్పున లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. మిగిలిన మంత్రులకు వారి ఉమ్మడి జిల్లాల పరిధిలోని లోక్‌సభ సెగ్మెంట్లకు ఇన్‌చార్జి అప్పగించారు.  

అన్నీ వారే...
అలాగే ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌కు మంత్రితోపాటు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇన్‌చార్జీలుగా ఉండనున్నారు. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఆయా సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు బాధ్యులుగా ఉంటారు. అలాగే ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌కు ఇద్దరు లేదా ముగ్గురు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శులకు సమన్వయ బాధ్యతలను అప్పగించారు. కేటీఆర్‌ ఆధ్వర్యంలో వీరంతా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయనున్నారు.

కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వ్యూహం, ప్రచార అంశాలను పర్యవేక్షించనున్నారు. మండలాలు, గ్రామాల వారీగా ఎప్పటికప్పుడు పార్టీల బలాబలాలను అంచనా వేసేలా టీఆర్‌ఎస్‌ వ్యవస్థను సిద్ధం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల సన్నాహక సదస్సులు ముగియగానే రెండోదశలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహం అమలు చేసేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

లోక్‌సభ ఎన్నికల బాధ్యులు...  
వరంగల్, మహబూబాబాద్‌: ఎర్రబెల్లి దయాకర్‌రావు
చేవెళ్ల, మల్కాజ్‌గిరి: చామకూర మల్లారెడ్డి
నల్లగొండ, భువనగిరి: జగదీశ్‌రెడ్డి
నిజామాబాద్, జహీరాబాద్‌: వేముల ప్రశాంత్‌రెడ్డి
ఆదిలాబాద్‌: ఇంద్రకరణ్‌రెడ్డి
పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్‌
కరీంనగర్‌: ఈటల రాజేందర్‌
సికింద్రాబాద్‌: తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
మహబూబ్‌నగర్‌: శ్రీనివాస్‌గౌడ్
నాగర్‌కర్నూల్‌: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement