సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అకాలీదళ్ నేత బిక్రం మజిథియాకు బహిరంగ క్షమాపణలు చెప్పిన కేజ్రీవాల్ తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీకి కూడా సారీ చెప్పారు.
దేశంలో అతిపెద్ద అవినీతిపరుడు నితిన్ గడ్కరీయేనంటూ గతంలో కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ధ్రువీకృతం కానీ, ఆధారాలు లేని ఆరోపణలు ఆయనపై చేసినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు కేజ్రీవాల్ ఒక లేఖలో తెలిపారు. ‘వ్యక్తిగతంగా మీపై నాకు ఎలాంటి కక్ష లేదు. ఆరోపణలు చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. గతంలో జరిగిన దానిని మరిచిపోయి.. కోర్టు కేసును ముగించేద్దాం’ అని ఆయన గడ్కరీకి రాసిన లేఖలో సూచించారు.
సోమవారం గడ్కరీ, కేజ్రీవాల్ ఢిల్లీ పటియాల కోర్టులో నడుస్తున్న పరువునష్టం దావా కేసును ముగించాలంటూ అభ్యర్థనలు దాఖలు చేశారు. తనపై ఆరోపణలు చేసినందుకు గడ్కరీ ఈ దావాను కేజ్రీవాల్‌పై వేశారు. కేజ్రీవాల్‌పై దాదాపు 33 పరువునష్టం దావాలు కోర్టులో దాఖలు అయ్యాయి. వాటిని కూడా ఇదేవిధంగా కోర్టుబయట పరిష్కరించుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అకాలీ నేత మజిథియాకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పడం పంజాబ్ ఆప్‌లో చిచ్చురేపింది. ఆయన తీరుకు నిరసనగా పార్టీ పంజాబ్ అధ్యక్షుడు భగవంత్ మాన్, ఉపాధ్యక్షుడు అమన్ అరోరా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment