సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా పైకి ఎదుగుతారని ప్రజలంతా భావిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్వీయ పాలనా వ్యవహారాలను కూడా పక్కన పెట్టి క్షమాపణ లేఖలు రాసుకోవడంలో బిజీ బిజీ అయ్యారు. శిరోమణి అకాలీ దళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజీథియాతోని మొదలైన ఆయన ‘సారీ’ లేఖల పర్వం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కపిల్ సిబాల్‌కు కూడా కొనసాగింది. నేడో, రేపో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా ఆయన క్షమాపణ లేఖలు అందనున్నాయి. అంతటితోని ఆయన ‘సారీ’ల పర్వం ఆగే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయనపై 30కిపైగా పరువు నష్టం కేసులు ఉన్నాయి.
దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నుంచే కేజ్రివాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పురుడు పోసుకున్న విషయం తెల్సిందే. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా నుంచి ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ వరకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న ఆయన మాటలకు విలువనిచ్చే ప్రజలు ఆయనకు పట్టంగట్టారు. లేదంటే భారతీయ సంస్కృతిలో గోమాత పవిత్రమైందంటూ పక్కన పెట్టినట్లుగా పూజ్యం భావంతోనే కేజ్రివాల్‌ను పక్కన పడేసేవారు.
అవినీతికి వ్యతిరేకంగా ఆయన తన పోరాటతత్వాన్ని నిజంగా చాటుకోక పోయినట్లయితే ‘వ్యవస్థలో అవినీతి అంతటా ఉంది’ అంటూ పదే పదే ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ‘సబ్ మిలే హువా హై జీ’ అన్న డైలాగ్‌తో కొట్టివేసేవారు. కేజ్రివాల్ ప్రవర్తనను ఆయన పార్టీ నాయకులు వాస్తవికవాదంగా చెప్పుకుంటున్నాయి. కోర్టు కేసులు కొట్లడాలంటే పార్టీ ఆర్థిక వనరులన్నీ కరిగిపోతాయని కొందరు నాయకులు వాదిస్తుండగా, ‘మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోలేం. ప్రజలకు అవసరమైన పాఠశాలలు, వైద్య శాలలు నిర్మించడంలో బిజీగా ఉండాలి’ అని డిప్యూటీ ముఖ్యమంత్రి మానిష్ సిసోడియా వ్యాఖ్యానించారు.
ఏదైమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది కేజ్రివాల్ వ్యవహారం. అస్తమానం కేంద్రంపై కయ్యానికి వెళ్లకుండా ఆయన తన పాలనా వ్యవహారాలపై దృష్టిని కేంద్రీకరించి ఉంటే అటు పార్టీ, ఇటు ప్రభుత్వం పరిస్థితి కూడా బాగుండేది. పర్యవసానంగా ఢిల్లీ పంచాయతీ ఎన్నికల్లో కూడా పట్టు సాధించలేక పోయారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ అభివృద్ధిపై కూడా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది. ముందుగా ఢిల్లీలోని 20 సీట్లకు ఉప ఎన్నికలు జరుగవచ్చు. 2019లో ఢిల్లీ లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో ఏడు సీట్లకుగాను కనీసం నాలుగు సీట్లనైనా ఆప్ గెలుచుకోవాల్సిన అవసరం ఉంది.
అరవింద్ కేజ్రివాల్ ఎప్పుడు కేంద్రంతో తగువు పడుతున్నప్పటికీ రాష్ట్రాభివృద్ధిలో ఫర్వాలేదనిపించారు. పాఠశాలలను నిర్మించడంలో విద్యుత్ చార్జీలను తగ్గించడంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్యాలయాలను ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. ఇప్పటికైనా ఆయన పూర్తిగా తన దృష్టిని రాష్ట్ర పాలనా వ్యవహారాలపైనే కేంద్రీకరించాలి.
Comments
Please login to add a commentAdd a comment