
సత్తుపల్లి(ఖమ్మం జిల్లా): మీ ఇంటి ఆడబిడ్డగా తనను గుర్తించి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరీ వేడుకున్నారు. సత్తుపల్లి కార్యకర్తల సమావేశంలో రేణుకా చౌదరీ మాట్లాడుతూ.. రాజ్యాంగం ఇచ్చిన హక్కును నేరవేర్చుకోవటం కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దేశానికి ప్రధాని అవుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ పేరుతో దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు బీజేపీ ప్రభుత్వం గురి చేసిందని అన్నారు. నైతిక విలువలను కోల్పోయిన నామా నాగేశ్వర రావు నేడు మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగాన్ని ఉల్లంగించే విధంగా, నమ్ముకున్న కార్యకర్తలను మోసగించేవిధంగా ప్రవర్తించి నేడు నామా పార్టీ మారారని ఆరోపించారు. స్థానికంగా ఉన్న పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. దొంగలకు గన్‌మెన్లను ఇచ్చిన కేసీఆర్, మహిళ అయిన తనకి గన్‌మెన్‌లను ఇవ్వలేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. తనను ఎంత రెచ్చగొడితే తాను అంత రెచ్చిపోతానని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. పోలీసు తనిఖీల పేరుతో తనను భయపెట్టలేరని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment