
శనివారం జేబీఎస్–ఎంజీబీఎస్ మెట్రో రైలు లోకోపైలట్ క్యాబిన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
అఫ్జల్‌గంజ్: పాతబస్తీకి మెట్రో రైలు రాకుండా మజ్లిస్ పార్టీ అడ్డుపడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్, టీఆర్‌ఎస్ పార్టీల వైఖరి వల్లే పాతబస్తీకి మెట్రో ఆగిందని విమర్శించారు. బీజేపీ ప్రతినిధుల బృందం ఆధ్వర్యంలో శనివారం ఆయన జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకూ మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపదికన అనుమతులు మంజూరు చేశారని గుర్తు చేశారు. మెట్రో ఛార్జీలు అధికంగా ఉన్నాయన్నారు.
పాతబస్తీలోని ఫలక్‌నుమా వరకూ మెట్రోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెట్రో ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విప్ జారీ చేశారని, అందుకే రాలేక పోయానని చెప్పానని తెలిపారు. ఎంఎంటీఎస్ ఫేజ్–2ను యాదగిరిగుట్ట వరకూ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. నగరంలోని అసెంబ్లీ ముందుగా మెట్రో రైలు వెళితే చారిత్రాత్మక కట్టడాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఎందుకు అదే మార్గానికి ఆమోదం తెలిపారో చెప్పాలని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment