కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
సాక్షి, కామారెడ్డి: టీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని బీజేపీ శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్ మాఫియా రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నిర్వహించిన మహాధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీఆర్‌ఏ సాయిలును ఇసుక మాఫియా హతమారిస్తే ప్రభు త్వ పెద్దల ఒత్తిడితో కలెక్టర్, ఎస్పీలు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారన్నారు. ఇసుక ట్రాక్టర్ కానప్పుడు అక్కడికి ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. వ్యవసాయానికి దన్నుగా ఉండేందుకు కేంద్రం అందిస్తున్న ట్రాక్టర్లను టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ కార్యకర్తలకు ఇచ్చి వాటితో ఇసుక వ్యాపారం చేయిస్తోందని ఆరోపించారు.
అంతా కేసీఆర్ స్వామ్యమే..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, అంతా కేసీఆర్ స్వామ్యమే నడుస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. మందకృష్ణ మాదిగను అరెస్టు చేసి జైలులో నిర్బంధించారన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని అణచివేస్తూ, మాఫియాను పెంచి పోషిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం లో పాల్గొనకుండా, ఉద్యమాన్ని అడ్డుకున్న వారంతా ఇప్పుడు ప్రగతి భవన్‌లో ఉన్నారన్నారు. దర్నా అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించిన కిషన్‌రెడ్డిని పోలీ సులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఆందోళనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆంజనేయులు, నాయకులు మురళీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment