
సాక్షి, హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికల్లో టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రచారం చేయకుంటే టీఆర్‌ఎస్ గెలిచేది కాదని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావుతో కలసి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకోసం త్యాగాలు చేసినవారిని, ఉద్యమాలు చేసిన సకల జనులను అవమానించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం దుర్మార్గమన్నారు.
కేవలం ఒక కులం వల్లనే తెలంగాణ వచ్చిందనేది సరైందికాదని, బీజేపీకి భయపడిన కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. బీజేపీ మద్దతు లేకుంటే వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ వచ్చేదికాదన్నారు. కాంగ్రెస్ వెనక్కిపోతే తమ పార్టీ నేతలు సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన 1,200 మందిని సీఎం కేసీఆర్ తక్కువ చేసి చూపించారని కిషన్‌రెడ్డి విమర్శించారు
. తెలంగాణకోసం మిలియన్ మార్చ్, సాగరహారం జరిగితే కేసీఆర్ ఎక్కడ ఉన్నారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న టీఆర్‌ఎస్‌ను నాడు ఢిల్లీలో ఎవరూ పట్టించుకోలేదన్నారు. దాదాపు 200 మంది ఎంపీలు ఉన్న బీజేపీ మద్దతుతోనే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలు, దళితులను మోసం చేసిన కేసీఆర్‌ను నిలదీసే హక్కు కోదండరాంకు లేదా అని ప్రశ్నించారు.
తెలంగాణకోసం ఉద్యమించిన కోదండరాంను వాడు, వీడు.. అని మాట్లాడటం కేసీఆర్ స్థాయికి తగదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించలేదని, 1969లోనే తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలను అర్పించారని పేర్కొన్నారు. బీజేపీ కాకినాడ తీర్మానం చేసినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని నిలదీశారు. ఎంతోమంది తెలంగాణకోసం ఉద్యమిస్తే అందరిలో కేసీఆర్ ఒక్కడు మాత్రమేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment