ఆ నమ్మకాన్ని వమ్ము చేయను : కొడాలి నాని | Kodali Nani Speaks About His Ministry Chance | Sakshi
Sakshi News home page

నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను : కొడాలి నాని

Published Sat, Jun 8 2019 10:39 AM | Last Updated on Sat, Jun 8 2019 2:56 PM

Kodali Nani Speaks About His Ministry Chance - Sakshi

సాక్షి, అమరావతి : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. వైఎస్‌ జగన్‌ కేబినేట్‌లో అవకాశం పొంది మరికాసేపట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా గుడివాడ ప్రజలు నాలుగు సార్లు గెలిపించారని, మంత్రిగా వైఎస్‌ జగన్‌ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ‘ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. కానీ మంత్రి పదవి మాత్రం ముఖ్యమంత్రి ఇచ్చేది. 151 ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు అవకాశాలు తక్కువగా ఉంటాయి. తొలి నుంచి వైఎస్‌ జగన్‌తో ఉండటం.. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, మా సామాజిక వర్గంలో ఎక్కువ సార్లు గెలిచిన వ్యక్తిని నేనే కావడంతో మంత్రిపదవి వరిస్తుందని ఆశించాను. కానీ ఖచ్చితంగా వస్తుందని మాత్రం అనుకోలేదు. అవకాశం ఉంటే వైఎస్‌ జగన్‌ తప్పుకుండా ఇస్తారనుకున్నా. అలానే ఆయన అవకాశం ఇచ్చారు.  ఏ శాఖ ఇచ్చినా అవగాహన తెచ్చుకొని సామర్థ్యం పెంచుకుని పనిచేస్తా.’ అని తెలిపారు.

అందుకే టీడీపీని వదిలా..
టీడీపీలో ఉంటే అప్పుడే మంత్రి అయ్యేవారు కదా అన్న ప్రశ్నకు.. మంత్రి పదవి కోసం తాను వైఎస్సార్‌సీపీలో చేరలేదని, ఆత్మభిమానాన్ని చంపుకొని పనిచేయలేక వదిలానని తెలిపారు. స్థానిక టీడీపీ నేతలతో పొసగకపోవడం.. ఎన్టీఆర్‌ కుటుంబ సన్నిహితుడునని చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బయటకు రావాల్సి వచ్చిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో తాను గుడివాడ ప్రతిపక్ష ఎమ్మెల్యేనని, అయినా వైఎస్సార్‌ సంక్షేమ నిధులు తన నియోజకవర్గానికి ఇచ్చారని తెలిపారు. అప్పుడే చంద్రబాబుకు, వైఎస్సార్‌కు ఉన్న వ్యత్యాసం తెలుసుకున్నానని, వైఎస్‌ జగన్‌పై అన్యాయంగా కేసులు బనాయించి పెట్టడం తాను దగ్గరుండి చూశానన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతటికైనా తెగిస్తారని గ్రహించి.. జగన్‌కు అండగా ఉండాలని వైఎస్సార్‌సీపీలోకి చేరానన్నారు. తాను మంత్రి అవ్వడం తన కార్యకర్తలకు, గుడివాడ ప్రజలకు సంతోషంగానే ఉంటుందని, కానీ తనకు మాత్రం భయంగా ఉందన్నారు. 151 సీట్లతో అఖండ విజయాన్నందించిన ప్రజలకు అవినీతి రహిత పాలనను అందజేయాలని, సీఎం వైఎస్‌ జగన్‌ స్థాయిలో పనిచేయాల్సి ఉంటుందనే బరువు, బాధ్యత, ఒత్తిడితో భయం కలుగుతోందన్నారు. ఏది ఏమైనప్పటికి సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement