సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలను పక్కదారి పట్టించడానికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాయమాటలు చెబుతున్నారని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ప్రజా సమస్యలు మీడియా దృష్టికి రాకుండా ఉండేందుకే ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ టీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు కేసీఆర్ చేతిలో లేనేలేవని, ఆయన ఇష్టమొచ్చినప్పుడు ఎన్నికలు పెట్టడానికి ఆయనేమైనా తీస్‌మార్ ఖానా.. అని ఘాటుగా విమర్శించారు.
టీజేఎస్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో తన అభిప్రాయాలను, ఆలోచనలను, పార్టీ కార్యాచరణను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తాయని కేసీఆర్ అబద్ధం ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు వందసీట్లు వస్తాయనడంలో నిజముంటే కేసీఆర్ చేయించిన సర్వేల్లో ఒక దానినైనా బయటపెట్టాలని సవాల్ చేశారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా సర్వే చేయలేదని, సర్వేల పేరుతో అన్నిపార్టీలు మాయ చేస్తున్నాయన్నారు. సొంత పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా, ఇతర పార్టీలను భయపెట్టాలనే ఉద్దేశంతోనే వంద సీట్లంటూ కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో టీజేఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడమంటే పురిటి బిడ్డను చంపుకోవడమేనని కోదండరాం వ్యాఖ్యానించారు.
కొత్తవారికి ఆహ్వానం...
టీజేఎస్ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారిని తమ పార్టీ ఆహ్వానిస్తోందని కోదండరాం అన్నారు. ముందస్తు ఎన్నికలు డిసెంబర్‌లో వస్తే రావచ్చన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలు అనొచ్చుగా అని ప్రశ్నించారు. కేంద్రం ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా రాష్ట్రపతి పాలన విధిస్తుందా? అన్నది తెలియదన్నారు. డిసెంబర్ 2 తరువాత అయితే ఎన్నికల నిర్వహణ అంశం ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుందని, అంతకంటే ముందు అయితే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నారు. ఎన్నికల విషయంలో కేంద్రం తనకు సహకరిస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు.
తనకున్న సమాచారం ప్రకారం ముందస్తు ఎన్నికలకు బీజేపీ సహకరించదన్నారు. అక్టోబర్, నవంబర్‌లో ముందస్తు ఎన్నికలని అనుకోవడానికి గ్యారెంటీ లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో తనకే స్పష్టత లేదని, అందుకే బయటకి కారణం చెప్పలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. అప్పట్లో చంద్రబాబు ముందస్తుకు వెళ్లి నష్టపోయారని గుర్తు చేశారు. ముందస్తుకు వెళ్లి ఇతర పార్టీలను దెబ్బతీయాలని కేసీఆర్ భావిస్తున్నారని, కానీ టీఆర్‌ఎస్ పార్టీలోని సమస్యలు పరిష్కరించడం కేసీఆర్‌కు అంత తేలిక కాదని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే టీజేఎస్ పార్టీకి లాభం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు, టికెట్ రాని ఇతర పార్టీలవారు తమ పార్టీలోకి వస్తారన్నారు. పొత్తుల కంటే తాము సొంతంగా బలపడటంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఎన్నికలకు తెలంగాణ అంశమే ముఖ్యమైనదని, కేసీఆర్ ప్రజలను మోసం చేసారని ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజల ఆకాంక్షను తీర్చే పార్టీ కేవలం టీజేఎస్ మాత్రమేనన్నారు. రాజకీయాల్లో కొత్త పార్టీలకు అవకాశం ఉంటుందని, గతంలో పీఆర్పీ, లోక్‌సత్తా, నవ తెలంగాణ ప్రజాపార్టీలను ప్రజలు ఆదరించినా, నేతలే నిలబడలేదన్నారు. కోదండరాం వెంట టీజేఎస్ అధికార ప్రతినిధి యోగేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment