
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రమంగా బలహీనపడుతోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం పోతోందని చెప్పారు. అమరుల స్పూర్తి యాత్ర కోసం పదిరోజుల క్రితమే అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసినప్పటికీ పోలీసులు ఆఖరి నిమిషంలో జేఏసీ నేతల అరెస్టులకు పాల్పడ్డారన్నారు. అనుమతి కోసం వెళితే అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే శనివారం నాలుగు వందల మంది జేఏసీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు.
ఆరో విడత అమరుల స్పూర్తి యాత్ర సందర్భంగా జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పోలీసుల అక్రమ అరెస్టుల నేపథ్యంలో జేఏసీ సంకల్పం మరింత బలపడిందని కోదండరామ్ స్పష్టం చేశారు. జేఏసీ నేతల అరెస్టులో ప్రభుత్వ తీరును ప్రతిపక్ష పార్టీలన్నిటికీ వివరిస్తామన్నారు. అదేవిధంగా గవర్నర్, రాష్ట్రపతికి సైతంఇక్కడి పరిస్థితిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా న్యాయపోరాటానికి సిద్దంగా ఉన్నామన్నారు. లైంగికదాడులు, దొమ్మీలవంటి నేరాలకు వర్తింపజేసే సెక్షన్ 151 కింద జేఏసీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తనను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ నేత వీహెచ్‌ను సైతం అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment