
టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన ముస్లింలకు పార్టీ కండువా కప్పుతున్న అంబటి రాంబాబు
సత్తెనపల్లి: పోలీసులను అడ్డుపెట్టుకుని స్పీకర్ కోడెల శివప్రసాదరావు రౌడీయిజం చలాయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ నుంచి పలువురు పార్టీలో చేరుతున్న సందర్భంగా సత్తెనపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లపాటు అధికారాన్ని, పోలీసులను అడ్టుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించారన్నారు. మాచర్ల రోడ్డులోని డంపింగ్ యార్డు వల్ల అనారోగ్యం బారిన పడుతున్న 26, 27, 28, 29 వార్డుల ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పోరాడారని చెప్పారు. డంపింగ్ యార్డు మార్చడమంటే ఒకరి చెత్త మరో ఇంటిలో వేయడం కాదన్నారు. డంపింగ్ యార్డు భీమవరం రోడ్డులోకి మార్చడం సరైంది కాదన్నారు. గొడుగుల సుబ్బారావుకు చెందిన 18 ఎకరాలు అప్పనంగా దోచుకున్నవే అందులో ఐదు ఎకరాలు కేటాయించలేవా అని అన్నారు. నాగుర్ మీరాన్‌కు చెందిన రిక్రియేషన్ క్లబ్‌పై కోడెల కన్ను పడిందని, కోర్టు ఆదేశాలను కూడా స్పీకర్ గౌరవించడం లేదని చెప్పారు.
అన్న క్యాంటీన్ ద్వారా పెట్టే అన్నం మెతుకులు కూడా అమ్ముకునే స్థాయికి దిగజారిపోయాడని విమర్శించారు. అందుకే ‘క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి’కి పిలుపునిచ్చామన్నారు. నిన్నటి వరకు మోదీతో అంటకాగిన టీడీపీ ఇప్పుడు ముస్లింల ఓట్ల కోసం తెగదెంపులు చేసుకుందన్నారు. గతంలో కూడా బీజేపీతో కలవబోమని చెప్పి 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశారన్నారు. త్వరలో మళ్లీ బీజేపీతో కలుస్తుందని చెప్పారు. నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నారా హమారాలో హామీలు అమలు చేయలేదని ముస్లిం సోదరులు ప్లకార్డులతో ప్రశ్నిస్తే వారిపై దేశద్రోహం కేసు పెట్టిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు.
ఈ సందర్భంగా టీడీపీకి చెందిన మస్తాన్‌వలి, జిలానీ, బుజ్జిబాబు, దరియా గౌస్, రసూల్, గౌస్, మస్తాన్, సయ్యద్‌బాజీ, షరీఫ్, పఠాన్ సుభాని, పఠాన్ పెదమాబు, పఠాన్ ఇమాంఖాన్, పఠాన్ మొహమ్మద్ ఖాశీం, షేక్ మీరావలిలతోపాటు ఆయా కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారికి అంబటి రాంబాబు, శ్రీకృష్ణదేవరాయలు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ నాగూర్‌మీరాన్ అధ్యక్షత వహించిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల నారాయణ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, పట్టణ పార్టీ అధికారప్రతినిధి ఎస్‌ఎం యూనస్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment