ఇనిమెట్ల పోలింగ్ బూత్‌లో వేలు చూపుతూ ఓటర్లను భయపెడుతున్న కోడెల
సాక్షి, గుంటూరు, రాజుపాలెం (సత్తెనపల్లి) : ఎన్నికల సందర్భంగా ఈ నెల 11వ తేదీన సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి, స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలింగ్ బూత్‌లో సృష్టించిన అరాచకాలకు సంబంధించిన వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ రోజు నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలోని పోలింగ్ బూత్‌లోకి దౌర్జన్యంగా చొరబడ్డ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను బెదిరించడమే కాకుండా తలుపులు మూసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం తెలిసిందే. అయితే గ్రామస్తులే తనపై దాడికి పాల్పడినట్లుగా చిత్రీ కరిస్తూ కోడెల వారిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారు. కానీ పోలింగ్ రోజు అక్కడ నిజానికి ఏం జరిగింది..? కోడెల ఎంత అరాచకంగా ప్రవర్తించారో, పోలింగ్ ఏజెంట్లను బయటకు వెళ్లి పొమ్మంటూ ఎలా బెదిరింపులకు పాల్పడ్డారో వెల్లడించే వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కోడెల పోలింగ్ బూత్‌లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమే కాకుండా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను వేలు చూపిస్తూ బెదిరించడం, మీ అంతు చూస్తానంటూ హెచ్చరించడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కోడెల బృందం దౌర్జన్యకాండతో దాదాపు 2 గంటల పాటు పోలింగ్ నిలిచిపోవడం తెలిసిందే. తాజా వీడియోలు కోడెల అరాచకాన్ని రుజువు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, పలువర్గాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
ఓటర్ల తిరుగుబాటుతో సానుభూతి డ్రామా
పోలింగ్ రోజు రాజుపాలెం మండలం ఇనిమెట్ల 160 పోలింగ్ కేంద్రం వద్దకు ఉదయం 10.40 గంటల సమయంలో కోడెల శివప్రసాదరావు తన అనుచరులతో కలసి చేరుకున్నారు. క్యూలైనులో ఉన్న ఓటర్లను బెదిరిస్తూ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించారు. కోడెలతో పాటు ఆయన అనుచరులు సుమారు 20 మంది పోలింగ్ బూత్‌లోకి చొరబడటం పట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆగ్రహించిన కోడెల వేలు చూపిస్తూ వారిని బెదిరించారు. పోలింగ్ బూత్ తలుపు మూసివేసి సుమారు 2 గంటలపాటు లోపలే కూర్చున్నారు. దీంతో ఆయన్ను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళనకు దిగగా కోడెల మాత్రం తాను ఇక్కడే ఉంటానని, ఏం చేసుకుంటారో చేసుకోమంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. బయటకు వెళ్లాలని కోరిన అధికారులపై సైతం దూషణలకు దిగారు. దీంతో పోలింగ్‌ను నిలిపివేశారు.
ఓటర్ల తిరుగుబాటుతో కంగుతిన్న కోడెల చొక్కా చింపుకుని సొమ్మసిల్లినట్లుగా డ్రామాకు తెరతీశారు. తనపై గ్రామస్తులే దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసుల సాయంతో వెళ్లిపోయారు. తనపై దాడి జరిగినట్లుగా నీరసంగా నడుస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. పోలీసులు సైతం ఆయనకు వంత పాడుతూ కోడెలపై గ్రామస్తులు దాడికి పాల్పడడం వల్లే పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులు మూసుకున్నారంటూ కథ అల్లారు. కోడెల స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుని గ్రామస్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దొరికిన వారిని దొరికినట్లు ఈడ్చుకెళ్లి పోలీసు స్టేషన్‌లో పడేశారు. బూత్ లోపల జరిగిన విషయం బయటకు తెలియదనే ధైర్యంతో అడ్డగోలుగా అబద్ధాలాడి తప్పించుకునే యత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా దృష్టి సారించడం, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మంగళవారం గవర్నర్‌ను కలసి ఈ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తేవడంతో స్పందించిన పోలీసులు కోడెల, ఆయన అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
త్వరలో అరెస్టులు..
ఎన్నికల సందర్భంగా పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లను బెదిరించడంతోపాటు బూత్ క్యాప్చరింగ్ ఘటనకు సంబంధించి కోడెల, ఆయన అనుచరులు మరో 21 మందిపై 188, 143, 341, 448, 506, రెడ్‌విత్, 149 ఐపీసీ, 131, 132 సెక్షన్‌ల కింద పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. కోడెల అనుచరులంతా నరసరావుపేట, రావిపాడు, గణపవరం గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు. పోలింగ్ ఏజెంట్ల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు. త్వరలో వారందరిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు.
కేసుల నమోదు వీరిపైనే
కోడెల శివప్రసాదరావు
గణేష్ వెంకట్రావు
పారా లక్ష్మీబాబు
చీరాల శ్రీకాంత్
నర్రా బాబూరావు
నర్రా సంద్యారాణి
కాంట్రకుంట హరికృష్ణ
నర్రా రమేష్
ఎస్‌కె.అల్లాభక్షి
పూదోట కిరణ్
మందడ రవి
కొక్కిరాల శ్రీనివాసరావు(బుజ్జి)
కాంట్రగుంట కృష్ణ
సాంబ(కెమేరామెన్)
నర్రా రామారావు
ఎస్‌కె.మాబూవలి
పచ్చా జవహర్
చుండు కోటేశ్వరరావు
పారా పద్మారావు
పారా రవి
పారా రమేష్
రాయంకుల మల్లేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment