విజయవాడ సిటీ: బీసీలు ఎక్కడ, ఏ స్థితిగతుల్లో ఉన్నారో?... అక్కడే ఉండేలా ఆదరణ పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి దుయ్యబట్టారు. బీసీ కుటుంబాల్లోని పిల్లల అభ్యున్నతికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. బలహీనవర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోనీయకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, బీసీ స్కాలర్ షిప్, విదేశీ విద్య ఇలా అన్నిటికీ గండికొట్టి అన్యాయం చేశారని ఆరోపించారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలను చంద్రబాబు బానిసలుగా మార్చారన్నారు. విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారథి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాలనలో బీసీలకు చేసిందేమీ లేదన్నారు. చట్టబద్ధత, విలువలు లేని జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, వాటి దగ్గర బీసీలు చేతులు కట్టుకొని నిలబడే దుస్థితిని చంద్రబాబు తీసుకొచ్చాడని మండిపడ్డారు. బీసీలను అవమానించి, అన్యాయం చేసిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని బీసీ గర్జన సభ పెట్టాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరాలు ప్రకటించి ప్రజలను మోసగించి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రాజమండ్రిలో అన్నపూర్ణమ్మపేట గ్రామంలో డ్వాక్రా మహిళలు గర్జన సభకు రాకపోతే సెల్‌ఫోన్ ఇవ్వం, రూ. పది వేలు ఇవ్వమని బెదిరించారని, దీంతో మహిళలు ధర్నాకు దిగారన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో బలహీనవర్గాలకు దాదాపు 125 హామీలు ఇచ్చారని, వాటిలో ఇప్పటి వరకు ఏ ఒక్కటైనా అమలు చేసిందేమో.. స్పష్టంగా చెప్పాలన్నారు. బలహీనవర్గాలకు మైనింగ్ మీద హక్కులు, ఇసుక క్వారీలు అన్నారు. ఒక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ అని అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయారు. ఇక చేపల వేటకు వెళ్లి గల్లంతైన వారి కుటుంబానికి నష్టపరిహారం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది అని ధ్వజమెత్తారు. చేనేతలకు వర్షాకాలంలో నెలకు రూ.4 వేలు ఇస్తామని ఇచ్చిన హామీకి ఇప్పటి వరకు అతీగతి లేదన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం తీసుకొచ్చి బలహీనవర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. టీడీపీ వచ్చిన తరువాత ఫీజురియింబర్స్‌మెంట్‌ను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.
రూ.2వేలు విలువ ఉన్న పనిముట్టు రూ.20వేలట...
ఆదరణ పేరుతో ప్రభుత్వం రూ.2 వేల విలువచేసే పనిముట్టును రూ.18 వేల నుంచి రూ.20 వేలతో కొనుగోలు చేసి అందులో కూడా కమీషన్ కొట్టేశారని ఆరోపించారు. ఆదరణ పథకాలు బలహీనవర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికా..? టీడీపీ నాయకులు జేబులు నింపుకోవడం కోసమా? చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోస్టుమెట్రిక్ స్కాలర్ షిప్ 2017–18కి బడ్జెట్‌లో రూ. 274.5 కోట్లు కేటాయిస్తే విడుదల చేసింది రూ.124 కోట్లు మాత్రమేనన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌కు 2017–18 బడ్జెట్‌లో రూ.1042 కోట్లు కేటాయించి కేవలం రూ. 517.27 కోట్లు మాత్రమే ఇచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment