సాక్షి, విజయవాడ : ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన స్థలంలో సాగిలపడి చంద్రబాబు నాయుడు నటిస్తున్నాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు. గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబు సాష్టాంగ నమస్కారం చేయాల్సింది మట్టికి కాదని.. రైతులకని హితవు పలికారు. ఈ అయిదేళ్లలో ఏ రోజు ఆలోచించని బాబు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసి 33 వేల ఎకరాలు దోచేందుకు ప్లాన్ చేశాడని మండిపడ్డారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రైతులిచ్చిన భూములను సింగపూర్ కంపెనీలకు, ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారని, ఏ హక్కు ఉందని ఆ భూములను ప్రైవేటు వారికి దానం చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. ‘అమరావతి పర్యటనలో తనపై చెప్పులు, రాళ్లు వేశారంటున్నారు. కానీ రైతులకు న్యాయం చేసి ఉంటే అలా చేసి ఉండేవారా’ అని నిలదీశారు. దళిత శాసన సభ్యులకు ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టలేని చంద్రబాబు ఇక్కడ కూడా వారిని అన్యాయం చేశారంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. అదే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. ప్రస్తుతం బాబును అడ్డుకునే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబులా మాయలు చేసే నైజాం తమది కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితం మొత్తం డ్రామాలేనని విమర్శించారు. ఇసుక అందుబాటులోకి వచ్చే సమయంలో నిరహార దీక్ష చేశాడని ఎద్దేవా చేశారు. రాజధాని పేరిట అమరావతిలో బాబు ఖర్చు పెట్టింది అయిదారు వేల కోట్లు మాత్రమేనని, రాజధాని మొత్తం కట్టినట్లు బిల్డప్ ఇస్తున్నాడని అన్నారు. అన్ని సెట్టింగులు, గ్రాఫిక్స్‌తో కాలం గడిపాడిన బాబు అయిదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీశాడని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment