సాక్షి, హైదరాబాద్ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడితేనే పదువులు ఇస్తారా అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఆయన శుక్రవారం మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. సీనియర్లను పట్టించుకోకుండా కమిటీ వేశారనేది తన ఆవేదనని, ఇది అర్థం చేసుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడినవారిని పక్కన పెట్టారని, షోకాజ్ నోటీసులు ఇవ్వడం కాదని, తన సూచనలను సానుకూలంగా తీసుకోవాలన్నారు. కార్యకర్తల ఆవేదనను వ్యక్తం చేశానని.. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తమలాంటి నేతలను ఉపయోగించుకోవాలన్నారు.
కొత్తగా పార్టీలో చేరిన వారికి బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఎందుకు పుంజుకోలేదో టీపీసీసీ సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు కమిటీల విషయంలో తమ అధినేత రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించారన్నారు. పార్టీ మారిన సురేశ్ రెడ్డి పేరు కూడా కమిటీలో ఉండటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. 70 ఏళ్లు నిండిన వాళ్లు కూడా పోటీ చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీని గెలిపించే ఆలోచన చేయాలని కోరుతున్నానని, గాంధీభవన్‌లో కూర్చుని పార్టీ పోస్టులు అమ్ముకునేవారు కూడా తనకు షోకాజ్ నోటీసులు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. తను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకుంటున్నానని, తనలాంటి వ్యక్తిని కోల్పోతే పార్టీకే నష్టమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment