సాక్షి, భువనగిరి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, నల్గొండ(ఉమ్మడి) జిల్లాకు చెందిన వ్యక్తే సీఎం అయి తీరుతారని ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తమ మధ్య భేదాభిప్రాయాలు లేవు కాబట్టే ఇంతమంది నేతలం ఇక్కడికి చేరుకున్నామని చెప్పారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. భవనగిరిలోని జయలక్ష్మి గార్డెన్స్‌లో జరిగిన భువనగిరి పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యాయి.
ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైనది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉందని ఏఐసీసీ కార్యదర్శులను పంపించారు. మనం మనం కొట్లాడుకుంటే కేసీఆర్ లాభపడతారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రి కావచ్చు. టీఆర్ఎస్‌లో మాత్రం అయితే కేటీఆర్, లేకపోతే హరీష్ రావు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే సీఎం అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కష్టపడ్డ వారికి తగిన ఫలితం ఉంటుంది.
కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా నన్ను కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్సీగా గెలిపించి సత్తా చాటారు. తెలంగాణ ప్రజలంతా నల్గొండ జిల్లా నాయకత్వం వైపు చూస్తున్నారు. పార్టీ నాయకులు అందరూ సమన్వయంగా కలిసికట్టుగా ముందుకెళ్తే 2019లో గెలుపు కాంగ్రెస్‌దే. ఇక్కడ వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం, భువనగిరిలో ఎలాంటి వర్గ విభేదాలు లేవు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే మన లక్ష్యమని’ ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment