
సాక్షి, నల్గొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకునేందుకు సీనియర్ నాయకులందరు ఒక్కో జిల్లాను దత్తత తీసుకుంటామని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శనివారం నాగార్జున సాగర్ విజయ విహార్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనను అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోవాలని నిర్ణయించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ కమిషన్‌ల కోసమే అని ఆయన ఆరోపించారు.
ఉస్మానియాలో రోగులకు మందులు లేవు గాని నూతన అసెంబ్లీ భవనాలకు ముహుర్తాలు పెడుతున్నారని కోమటిరెడ్డి మండి పడ్డారు. పాత భవనాలు కూలగొట్టకుండా కోర్టుకు వెళ్లామని తెలిపారు. రైతు బంధు డబ్బుతో రైతులు సంతోషంగా లేరని.. వచ్చిన డబ్బులను బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దించడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం అన్నారు. రానున్న నాలుగున్నరేళ్లు ప్రజల్లోనే ఉంటామన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment