మార్పు దిశగా  కృష్ణమ్మ | Krishna District Elections Are Seeking Political Change. | Sakshi
Sakshi News home page

మార్పు దిశగా  కృష్ణమ్మ

Published Tue, Apr 2 2019 10:37 AM | Last Updated on Tue, Apr 2 2019 2:09 PM

Krishna District Elections Are Seeking Political Change. - Sakshi

సాక్షి, విజయవాడ : కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్యకు జిల్లాతో అనుబంధం.. ఏపీ శాసనసభ తొలి సభాపతి  కాళేశ్వరరావు.. తెలుగుజాతి గౌరవాన్ని సమున్నతంగా  వ్యాపింపచేసిన ఎన్టీఆర్‌ లాంటి మహామహులను అందించింది కృష్ణా జిల్లా .  రాజకీయ, ఆర్థిక, రవాణారంగం, సామాజిక, వ్యాపార చైతన్యానికి నెలవై.. కృష్ణా జలాలతో సస్యశ్యామలవుతున్నదీ ఈ ప్రాంతం.  ఎన్నికల వేళ ఇప్పుడీ జిల్లా రాజకీయ మార్పు కోరుకుంటోంది.

విజయవాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో నూజివీడు, కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జిల్లాలో.. ఈ నెల 11న జరిగే ఎన్నికల పోరులో ప్రధాన పోటీ వైస్సార్‌సీపీ, టీడీపీల మధ్యనే ఉంది. జిల్లాలో ఈసారి ఫలితాలు తారుమారు చేసే విధంగా వైఎస్సార్‌సీపీ హోరాహోరీగా పోరాడుతోంది. జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచేందుకు గట్టిగా కృషి చేస్తోంది. 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేస్తున్న వరుస జిల్లా పర్యటనలు, నవరత్న పథకాలు, ఇస్తున్న హామీలు.. అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. జిల్లాలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆయన చేస్తున్న ప్రసంగాలు.. ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. రాజధాని నగరంలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ నిర్మించలేని తెలుగుదేశం ప్రభుత్వం.. రాజధాని నిర్మాణంలో జరుగుతున్న అవినీతి.. ఇసుక మాఫియాకు ప్రోత్సాహం.. కోట్లాది రూపాయల మట్టిని అక్రమంగా అమ్ముకోవడం.. కాల్‌మనీ సెక్స్‌రాకెట్, మహిళలపై అత్యాచారాలు.. దళితులపై దాడులను అరికట్టలేకపోవడం..

ఇచ్చిన హామీలు అమలు చేయని అధికార పార్టీ కష్టాలకడలిలో కొట్టుమిట్టాడుతోంది. మంత్రులు, శాసనసభ్యులు ప్రత్యక్షంగా అవినీతిలో కూరుకుపోవడం.. ఆ పార్టీ అవకాశాలు సన్నగిల్లేలా చేస్తోంది. టీడీపీలో ఆత్మస్థైర్యం కొరవడి, ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులను, సీనియర్‌ నాయకులను అరువు తెచ్చుకొని ప్రచారం చేయించుకునే స్థాయికి దిగజారింది. ఇప్పటికే చంద్రబాబు పాలన చూశాం.. ఈసారి జగన్‌కు అవకాశం ఇద్దాం’ అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వ్యక్తం అవుతోంది. జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం రెండుమూడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఉన్నా.. అది గెలిచే స్థాయిలో ఎక్కడా లేదు. కేవలం ప్రధాన పార్టీల ఓట్లను చీల్చడం వరకు మాత్రమే పరిమితం అవుతోంది. అదే సమయంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం తాపత్రయపడుతున్నాయి.  

తిరువూరు

  • తిరువూరులో ప్రస్తుత ఎమ్మెల్యే కె.రక్షణనిధి మరోసారి విజయం సాధిస్తారన్న విశ్వాసం వైఎస్సార్‌సీపీలో వ్యక్తం అవుతోంది. వివాదరహితుడిగా, అందరిని కలుపుకొని వెళ్లే వ్యక్తిగా ఆయనకు  పేరుంది. అందరిని కలుపుకుపోతూ ప్రచారంలో ముందున్నారు. 
  • తెలుగుదేశం తరపున పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి మంత్రి జవహర్‌ను తీసుకొచ్చి ఇక్కడ పోటీలో పెట్టారు. చివరి నిమిషంలో టికెట్ల సర్దుబాటులో భాగంగా ఆయనకు ఇక్కడకు వచ్చారు. ఈ స్థానం నుంచి టికెట్‌ ఆశించిన స్వామిదాసుకు టీడీపీ మొండిచేయి చూపింది. స్వామిదాసు, ఆయన భార్య మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ సుధారాణి టీడీపీకి సహకరించడం లేదని చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా ఇక్కడ శుద్ధిచేసిన తాగునీటిని సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఐదేళ్లు గడిచినా అది సాకారం కాలేదని ప్రజలు చెబుతున్నారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మామిడిపళ్ల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా గాలికొదిలేశారని రైతులు మండిపడుతున్నారు. 

జగ్గయ్యపేట

  • వైఎస్సార్‌సీపీ నుంచి సామినేని ఉదయభాను రంగంలో ఉన్నారు.  ఉదయభాను ఎమ్మెల్యేగా, విప్‌గా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టడం, ప్రజల్లో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌(శ్రీరాం తాతయ్య) టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే సోదరుడు, కుమారుడి సెటిల్‌మెంట్‌ దందాలు టీడీపీకి నష్టం కలిగించనున్నాయి.
  • ఈ నియోజకవర్గంలో పెద్దఎత్తున సిమెంట్‌ పరిశ్రమలున్నా.. వాటిలో స్థానికులకు ఉపాధి కల్పించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని యువత అసంతృప్తితో ఉంది. దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న చుక్కల భూములపై హక్కు కల్పించకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేడంలో ప్రభుత్వం విఫలమైందన్న అభిప్రాయం ఉంది. 

నందిగామ

  • ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎం.జగన్మోహన్‌రావు బరిలో ఉన్నారు. రెండోసారి పోటీలో ఉన్న ఈయనకు డాక్టర్‌గా మంచిపేరుంది. ఐదారేళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ప్రజల తరుపున పోరాడుతూ ఉన్నారు. దేవినేని ఉమ దాష్టీకాలను తట్టుకుంటూ నియోజకవర్గంలో నిలబడ్డారు. గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి డాక్టర్‌కు ఉంది.
  • గతవారం వైస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నందిగామలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ఇక్కడి నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. ‘వసంత’ కుటుంబం వైఎస్సార్‌సీపీలోకి రావడంతో ఇక్కడ పరిస్థితి మరింత మెరుగైంది. మహిళలకు టీడీపీ చేసింది ఏమీ లేదని ఆ పార్టీకి చెందిన వార్డు సభ్యురాలు నాగమణి వ్యాఖ్యానించారు. 
  • టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా సౌమ్య ఉన్నా.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులదే ఇక్కడ హవా. కృష్ణా నది దగ్గర్లోనే ఉన్నా.. సాగునీరు లేదు. సుబాబుల్‌కు ధర లేక ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోలేదని రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
  • అక్రమ ఇసుక దందాతో మంత్రి అనుచరులు మాఫియాలా తయారయ్యారు. తండ్రి ఆకస్మికంగా మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చిన సౌమ్య..  మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమెకు టికెట్‌ ఇవ్వొద్దంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా ఆమెకే టికెట్‌ ఇవ్వడంతో ఆ పార్టీ నాయకులు పలువురు పార్టీని వీడారు. దాంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ బలహీనపడింది.

విజయవాడ సెంట్రల్‌

  • విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఈసారి వైఎస్సార్‌సీపీ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. వైఎస్సార్‌సీపీ నుంచి మల్లాది విష్ణు రంగంలో ఉన్నారు.  మల్లాది విష్ణు నిత్యం ప్రజల్లో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలతో మమేకమవుతూ.. పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇళ్లు నిర్మించుకున్న వారికి స్థలాల పట్టాలు ఇప్పిస్తామని భరోసా కల్పిస్తున్నారు.
  • టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావుపై కబ్జాలు, దౌర్జన్యాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఐదేళ్లుగా బోండా అక్రమ సంపాదన, దౌర్జన్యాలు విస్తృతంగా వెలుగులోకి వచ్చిన అంశాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల భూములు లాక్కోవడం, ప్రతీపనిలో వాటాలు దండుకున్నారన్న విమర్శ ఉంది.  కరకట్టలు, కొండలపై నివాసం ఉన్న బలహీనవర్గాల ప్రజలకు పట్టాలు, రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదన్న విమర్శ ఉంది. ఆయన మాటతీరు కూడా సరిగా ఉండదన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. 
  • జనసేన, సీపీఐ, బీఎస్పీ మద్దతుతో సీపీఎం తరఫున సీహెచ్‌ బాబూరావు బరిలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి బాబూరావు తాను చేసిన పోరాటాలు, ప్రజా సమస్యలకు అండగా నిలబడి చేసిన పనులు వివరిస్తూ ముందుకెళుతున్నారు. పవన్‌ అభిమానుల ఓట్లు ఈసారి తనకు బలం చేకూరుస్తాయని ఆయన భావిస్తున్నారు.

మైలవరం

  • ఇద్దరు బలమైన అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ నుంచి, వైఎస్సార్‌సీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్‌ హోరాహోరి తలపడుతున్నారు.  మంత్రివర్గంలో కీలకమైన మంత్రిగా ఉన్న ఉమా.. తన నియోజకవర్గం దాటి ప్రచారం చేయలేని స్థితిలో పడిపోయారు. ఉమపై వ్యతిరేకత బలంగా ఉంది. మంత్రి కారణంగానే తాము లారీలను అమ్ముకొని ఇప్పుడు డ్రైవర్లుగా మారామని తుమ్మలపాలెంకు చెందిన శివనారాయణ వ్యాఖ్యానించారు.
  • అన్ని మండలాల్లో అభివృద్ధి చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇసుక మాఫియా మొత్తం మంత్రి కనుసన్నల్లోనే సాగుతోంది. మంత్రి ఉమ చేసే అరాచకాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వసంత ఎండగడుతున్నారు. పార్టీ సమన్వయకర్తగా నియమితులైనప్పటి నుంచి ఆయన విస్తృతంగా నియోజకవర్గం కలియతిరుగుతూ.. అందర్ని కలుపుకొంటూ ప్రచారం చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో ఉమతో ధీటుగా పోటీపడుతున్నారు. 

గన్నవరం

  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి దాసరి జై రమేష్, దాసరిబాలవర్దన్‌రావు పార్టీలో చేరడంతోబలం చేకూరింది. విజయవాడకు ఆనుకుని ఉన్న గన్నవరంలో టీడీపీ బెదిరింపు రాజకీయాలు చేస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ తరపున  మరోసారి పోటీలో ఉన్నారు. చిక్కవరం బ్రహ్మలింగేశ్వరస్వామి చెరువు నీరు–చెట్టు పథకంలో, పోలవరం కాలువ నిర్మాణ సమయంలో వందలకోట్ల రూపాయలకు పైగా మట్టి అక్రమంగా అమ్ముకున్నారు.
  • గన్నవరం విమానాశ్రయం రన్‌వే భూసేకరణలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. చెరువు మట్టిని రైతులెవరైనా తీసుకెళ్తే మాత్రం వెంటనే కేసులు నమోదు చేసే యంత్రాంగం.. ఎమ్మెల్యే కనుసన్నల్లో వేల ట్రక్కుల మట్టి తరలిపోతుంటే మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని గొల్లనపల్లిలో చిన్నహోటల్‌ నడుపుతున్న వ్యాపారి ఒకరు వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో మోటార్లు పెట్టి రైతులకు సాగునీరు అందించారని చెబుతున్నా.. జన్మభూమి కమిటీలు ఆ రైతుల నుంచి డబ్బు వసూలు చేశారని ఓ రైతు వ్యాఖ్యానించారు. 

విజయవాడ ఈస్ట్‌

  • వైఎస్సార్‌సీపీ నుంచి బొప్పన భవకుమార్‌ బరిలో ఉన్నారు. ఈయన కార్పొరేటర్‌గా ప్రజలకు దగ్గరగా ఉంటూ.. సమస్యలను విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో వినిపిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరుంది. తన సామాజిక వర్గంతోపాటు, పార్టీలోని ఇతర నాయకులను కలుపుకొని వెళ్లడానికి కృషి చేస్తున్నారు.
  • కరకట్టలపై నివాసం ఏర్పరచుకున్న వారికి భరోసా కల్పిస్తూ.. ఇళ్ల నిర్మాణం చేపడతామని.. ఇదివరకే ఉంటున్న వారికి పట్టాలు పంపిణీ చేస్తామన్న హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
  • టీడీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు బరిలో ఉన్నారు. ఈయనకు వివాదరహిత వ్యక్తిగా పేరున్నా.. ప్రజలకు ఏమీ చేయలేదనే అభిప్రాయం ఉంది. కృష్ణలంక రామలింగేశ్వరనగర్‌ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆ ప్రాంత ప్రజలకు గద్దెపై తీవ్ర అసంతృప్తి ఉంది. 
  • జనసేన నుంచి బత్తిన రాము బరిలో ఉన్నా.. ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం లేదన్న అభిప్రాయం ఉంది. 

విజయవాడ పశ్చిమ

  • ఇక్కడ దళితులు, మైనారిటీలు, నగరాలు, వైశ్య, మార్వాడి వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.  వైఎస్సార్‌సీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్‌ రంగంలో ఉన్నారు. 2009లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌లో విలీనమయ్యాక నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చడానికి కృషి చేస్తారనే పేరుంది. వైఎస్సార్‌సీపీ ప్రధానంగా మైనారిటీలు, దళితులు, వైశ్య ఓట్లపై దృష్టి పెట్టింది. 
  • గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తరువాత టీడీపీలోకి మారారు జలీల్‌ఖాన్‌. ఈయన పార్టీ మారడంపై ప్రజల్లో వ్యతిరేక ఉంది. ఈసారి ఆయన కూతురు షబానా ఖాతూన్‌ను రంగంలోకి దించారు. ఐదేళ్ల నుంచి దుర్గ గుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణం ఒక కొలిక్కి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల కోసం 25 వేల మంది దరఖాస్తు చేసుకున్నా.. ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు కాలేదు. ఇవన్నీ టీడీపీ అభ్యర్థికి వ్యతిరేక అంశాలే. వక్ఫ్‌ భూముల లీజులో జరిగిన అక్రమాల్లో జలీల్‌ఖాన్‌ పాత్ర ఉందని తేలింది. పెద్దఎత్తున ఆందోళన నేపథ్యంలో అవి రద్దయ్యాయి. మైనారిటీలు జలీల్‌ఖాన్‌ వైఖరిపై మండిపడుతున్నారు. 
  • జనసేన నుంచి పోతిన మహేష్‌ పోటీలో ఉన్నారు. 

పెనమలూరు

  • పెనమలూరు నియోజకవర్గంలో పోటీ గట్టిగానే ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతం కలగలసి ఉన్నదీ సెగ్మెంట్‌. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైఎస్సార్‌సీపీ నుంచి, టీడీపీ నుంచి బోడె ప్రసాద్‌ రంగంలో ఉన్నారు. పార్థసారథి సుధీర్ఘ రాజకీయ అనుభవం, అందరిని కలుపుకొని వెళ్లే మనస్తత్వంతో, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తున్నారు.
  • తాగునీటి ట్యాంకుల నిర్మాణం, ఉయ్యూరులో మురుగునీటి కాల్వల నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్, నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూముల సేకరణ చేసిన అంశాలతోపాటు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టేబోయే నవరత్న పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
  • టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌.. ఎమ్మెల్యేగా అవినీతి కార్యకలాపాలతో పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. కాల్‌మనీ రాకెట్‌తో సంబంధాలున్న వ్యక్తులకు పూర్తి అండదండలందించారన్న విమర్శ ఉంది. టీడీపీ నాయకుల్లో సమన్వయం లేకపోవడం, కొన్ని వర్గాలను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఉంది. భూముల సెటిల్‌మెంట్, బిల్డర్ల నుంచి బలవంతపు వసూళ్లు, ఇసుక మాఫియాను ప్రోత్సహించారని ఆరోపణలు బోడె ప్రసాద్‌పై ఉన్నాయి. 

పామర్రు

  • పామర్రులో ఎన్నిక ఏకపక్షంగా సాగే అవకాశం కనిపిస్తోంది. 
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న కె.అనిల్‌కుమార్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే డీవై దాసు  వైఎస్సార్‌సీపీలో చేరడంతో అనిల్‌కుమార్‌ విజయం నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
  • ఇక్కడ గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ తరువాత టీడీపీలో చేరిన ఉప్పులేటి కల్పనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పిన కల్పన ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని పళ్ల వ్యాపారం నిర్వహించే పద్మజ అనే మహిళ వ్యాఖ్యానించారు. తోటవల్లూరు–లంకపల్లిలో కృష్ణానదిపై ఆగిపోయిన వంతెనను నిర్మిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఇసుక క్వారీల నుంచి మామూళ్లు, బినామీ పేర్లతో మద్యం దుకాణాల నిర్వహణ.. ఆమెపై వ్యతిరేకత పెంచింది.  ఘంటసాలలో సంగీత, నృత్య యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీకి దిక్కులేదు. 
  • జనసేన పొత్తులో భాగంగా ఈస్థానాన్ని బీఎస్పీకి కేటాయించింది. ఆ పార్టీ అభ్యర్థి ప్రభావం చూపే అవకాశం లేదు. 

ఆవనిగడ్డ

  • వైఎస్సార్‌సీపీలోకి ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరుతుండడం పార్టీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌ బాబుకు అనుకూలంగా మారుతోంది. మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్, మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు వైసీపీ వెంట నడుస్తున్నారు. ఇక్కడ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బహిరంగ సభకు విశేష స్పందన లభించింది.
  •  సింహాద్రి రమేష్‌ బాబు అన్నివర్గాలతో, నాయకులతో కలుస్తూ దూసుకుపోతున్నారు. ఈసారి జగన్‌కు అవకాశం ఇద్దామన్న వాదన ప్రజల్లో బలంగా ఉండడం కూడా సింహాద్రి రమేష్‌కు మరింత బలం చేకూరుస్తోంది. ఎదురుమొండి వారధి నిర్మిస్తామన్న హామీ ఆయనకు సానుకూలం అవుతోంది. 
  • టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌కు సామాన్య ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.70 కోట్లు మంజూరయ్యాయని చెప్పడమే తప్ప.. పనులేవీ చేపట్టకపోవడం, ఆ గ్రామాలకు తాగునీరు ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. ఎదురుమొండి–నాచుకుంటల మధ్య రోడ్డు నిర్మాణం మధ్యలోనే వదిలేశారు. జన్మభూమి కమిటీల పేరుతో జరిగిన అరాచకాల కారణంగా బుద్ధప్రసాద్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని స్థానిక బుక్‌స్టాల్‌ యాజమాని యోగానంద్‌ వ్యాఖ్యానించారు.
  • ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి రంగంలో ఉన్న కంఠమనేని రవిశంకర్‌కు కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తల మద్దతునిస్తున్నారు. గతంలో తెలుగుదేశం ఇంచార్జ్‌గా పనిచేసిన ముత్తెంశెట్టి కృష్ణారావు ఇప్పుడు జనసేన నుంచి రంగంలో ఉన్నారు. ఆయనకూ టీడీపీ నాయకులు అంతర్గత మద్దతునిస్తున్నారు. దీనితో టీడీపీ బలహీనపడింది. 

మచిలీపట్నం

  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న పేర్ని వెంకట్రామయ్య(నాని) సామాన్య కార్యకర్తగా అందరితో మమేకమవుతూ.. ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బందరుపోర్టు కోసం మొదటి నుంచి ఆందోళన చేస్తున్న పేర్ని నానికి ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది. వైఎస్సార్‌సీపీకి అండగా ఉన్న సామాజిక వర్గ ఓట్లను చీల్చడానికి జనసేన ఇక్కడ బండి రామకృష్ణను రంగంలోకి దించినా.. ఆ ప్రభావం పెద్దగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పేర్ని నానికి బలహీనవర్గాలు, మైనారిటీల్లో మంచి పేరుంది. బాధితుల పక్షాన నిలుస్తారన్న పేరుంది. 
  • ఈ నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చిన హామీలు ఏవీ నిలబెట్టుకోలేదన్న ఆగ్రహాం ప్రజల్లో ఉంది. ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కాకపోవడం.. మచిలీపట్నానికి విజయవాడ నుంచి పైపులైను ద్వారా తాగునీరు సరఫరా చేయకపోవడం.. భూగర్భ మురుగునీటి కాల్వలు, కాపు భవన్, బందర్‌పోర్టు నిర్మాణం చేపట్టలేదని మంత్రి రవీంద్రపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.

    ఆయన మామ నడికుదిటి నరసింహారావు ‘అన్ని వ్యవహారాలను’ చక్కపెడుతుంటారని ప్రచారం. మైనారిటీలకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కోనేరు సెంటర్‌లో పూలవ్యాపారం చేసే అక్బర్‌ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తోందని బీటెక్‌ పూర్తిచేసిన యువకుడు సునీల్‌ వ్యాఖ్యానించారు. కొన్ని గ్రామాల్లో మంత్రి ప్రచారానికి వస్తే..రావద్దంటూ ప్రజలు అడ్డుకుంటున్నారు.
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న పేర్ని వెంకట్రామయ్య(నాని) సామాన్య కార్యకర్తగా అందరితో మమేకమవుతూ.. ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బందరుపోర్టు కోసం మొదటి నుంచి ఆందోళన చేస్తున్న పేర్ని నానికి ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది. వైఎస్సార్‌సీపీకి అండగా ఉన్న సామాజిక వర్గ ఓట్లను చీల్చడానికి జనసేన ఇక్కడ బండి రామకృష్ణను రంగంలోకి దించినా.. ఆ ప్రభావం పెద్దగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పేర్ని నానికి బలహీనవర్గాలు, మైనారిటీల్లో మంచి పేరుంది. బాధితుల పక్షాన నిలుస్తారన్న పేరుంది.
  • ఈ నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చిన హామీలు ఏవీ నిలబెట్టుకోలేదన్న ఆగ్రహాం ప్రజల్లో ఉంది. ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కాకపోవడం.. మచిలీపట్నానికి విజయవాడ నుంచి పైపులైను ద్వారా తాగునీరు సరఫరా చేయకపోవడం.. భూగర్భ మురుగునీటి కాల్వలు, కాపు భవన్, బందర్‌పోర్టు నిర్మాణం చేపట్టలేదని మంత్రి రవీంద్రపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆయన మామ నడికుదిటిæ నరసింహారావు ‘అన్ని వ్యవహారాలను’ చక్కపెడుతుంటారని ప్రచారం.
  • మైనారిటీలకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కోనేరు సెంటర్‌లో పూలవ్యాపారం చేసే అక్బర్‌ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తోందని బీటెక్‌ పూర్తిచేసిన యువకుడు సునీల్‌ వ్యాఖ్యానించారు. కొన్ని గ్రామాల్లో మంత్రి ప్రచారానికి వస్తే..రావద్దంటూ ప్రజలు అడ్డుకుంటున్నారు.

పెడన

  • వైఎస్సార్‌సీ అభ్యర్థి జోగి రమేష్‌ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి కాగిత వెంకట్రావు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. ఆ హామీలేవీ అమలు చేయకపోవడంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. పార్టీలో అందరిని కలుపుకొని వెళ్తున్నారు. వైసీపీ  అధికారంలోకొస్తే చేపట్టే..అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారితో మమేకం అవుతున్నారు.

    పెడన గ్రామీణ ప్రాంతంలో రెండు పంటలకు నీరందిస్తామని... దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హాయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణం అంశాన్ని జోగిరమేష్‌ ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు.  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు బూరగడ్డ రమేష్‌నాయుడు, ఉమామహేశ్వరరావు తదితర నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరడంతో పార్టీ మరింత బలం పుంజుకొంది.
  • టీడీపీ తరపున కాగిత వెంకట కృష్ణ ప్రసాద్‌ బరిలో ఉన్నారు. ఈయన గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కాగిత వెంకట్రావు తనయుడు. వెంకట కృష్ణప్రసాద్‌కు అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కృత్తివెన్ను మండలంలోని మాట్లాం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని.. తద్వారా 10 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న ప్రధాన హామీ విస్మరించారు.  టెక్స్‌టైల్‌ పార్క్‌తో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీ కూడా అటకెక్కింది. నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. నిరుద్యోగి భృతి అంటూ ఎన్నికల ముందు ఓట్ల కోసం గాలం వేసినట్లు టీడీపీ ప్రభుత్వ పనితీరు ఉందని బీటెక్‌ విద్యార్థి అబ్దుల్‌ అబ్రహాం వ్యాఖ్యానించారు. 
  • జనసేన నుంచి అంకెం శ్రీనివాస్‌ రంగంలో ఉన్నా, ప్రభావం ఉండదంటున్నారు.

కైకలూరు

  • ఇక్కడ ప్రధాన పోరు వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే ఉంది. వడ్డీ, యాదవ, గౌడ, కాపు సామాజిక వర్గాలు ప్రధాన పాత్ర. లంక గ్రామాల్లోని మత్స్యకారుల ఓట్లు కీలకం. కైకలూరు సర్పంచ్‌గా, పారిశ్రామికవేత్తగా పేరున్న దూలం నాగేశ్వరరావు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పటికే పారిశ్రామికవేత్తగా పలువురికి ఉపాధి కల్పిస్తున్న నాగేశ్వరరావు.. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే.. రెగ్యులేటర్‌ నిర్మాణం, వడ్డీలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, రెండు పంటలకు సాగునీరందిస్తామన్న హామీలతో ముందుకు వెళ్తున్నారు.
  • ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేసిన జయమంగళ వెంకటరమణ టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. కొల్లేరు కాంటూరు పరిధి తగ్గించడం, కొల్లేటి గ్రామాలకు వెళ్లడానికి వారధి నిర్మిస్తామన్న హామీలు ముందుకు సాగకపోవడం.. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయలేదన్న విమర్శలు వెంకటరమణకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. చేపలచెరువుల పుణ్యమా సాగు తగ్గిపోయింది. మోటార్లతో కాల్వలనీరు లాగేయడంతో తాగడానికి నీరు కరువైంది అని ఏడుకొండలు అనే రైతు వ్యాఖ్యానించారు. ఆక్వా చెరువులు,చేపల చెరువులతో భూగర్భ జలాలు కలుషితమవడం, తాగునీటి ఇబ్బందులు టీడీపీకి వ్యతిరేకంగా మారాయి.  
  • ఇక్కడ జనసేన నుంచి చార్టెడ్‌ అకౌంటెంట్‌ బీ వీ రావును అభ్యర్థిగా నిలుపుతోంది.

గుడివాడ

  • గుడివాడ నుంచి హ్యాట్రిక్‌  విజయం సాధించిన కొడాలి వెంకటేశ్వరరావు(కొడాలి నాని) మరోసారి విజయం సాధించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. నియోజకవర్గంలో అడుగడుగు పూర్తి అవగాహనతో ఉన్న నాని.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అధికార పక్షం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అభివృద్ధికి సహకరించపోయినా.. వ్యక్తిగతంగా ఆయా గ్రామాల్లో ప్రగతికి పాటుపడ్డారన్న మంచి పేరుంది. తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిని ఓడించడానికి టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టినా... ఆయన ఎస్సీ, మైనారిటీ, వెనుకబడిన వర్గాల అండదండలతో ముందుకు సాగుతున్నారు.  
  • గుడివాడ టీడీపీలో గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఎవరికి టికెట్‌ కేటాయించాలో తెలియక.. పెనమలూరు టికెట్‌ ఆశించిన దేవినేని అవినాష్‌కు గుడివాడ టికెట్‌ను కట్టబెట్టారు. ఇక్కడ టీడీపీ గ్రూపు రాజకీయాలు అవినాష్‌కు సహకరించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక్కడ టీడీపీ జన్మభూమి కమిటీల అకృత్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేవలం ధన రాజకీయాలను నమ్ముకున్న టీడీపీ.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ నాయకులను కొనుగోలు చేసే దిశగా పావులు కదుపుతోంది. 

నూజివీడు

  • ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ మరోసారి విజయం కోసం తహతహలాడుతోంది. నియోజకవర్గం నుంచి వెంకట ప్రతాప్‌ అప్పారావు మరోసారి బరిలో ఉన్నారు.  సౌమ్యుడిగా, ఎవరికి  చెడు చేయని వ్యక్తిగా మంచి పేరున్న అప్పారావు పట్ల టీడీపీ వర్గాల్లోనూ సానుకూలత వ్యక్తం కావడం విశేషం. 
  • టీడీపీ నుంచి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రంగంలో ఉన్నారు. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి నష్టం చేకూర్చనున్నాయి. దుందుడుకు స్వభావం ఉన్న వెంకటేశ్వరరావుపై ప్రధాన సామాజికవర్గం వ్యతిరేకతతో ఉంది. ఏలూరు లోక్‌సభ అభ్యర్థి మాగంటి బాబుకు ముద్దరబోయినకు మధ్య సఖ్యత లేదు. నూజివీడులో మామిడి పరిశోధనా కేంద్రం, ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామన్న టీడీపీ.. గత ఐదేళ్లుగా ఆ ఊసెత్తకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
  • కృష్ణా జలాలు తరలించడంలో ప్రభుత్వం విఫలమైందన్న భావన అక్కడి వారిలో ఉంది. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించ లేదని వారు ఆక్రోశంతో ఉన్నారు. –కాపుల ఓట్లలో చీలిక తేవడానికి జనసేన ఆఖరి నిమిషంలో భాస్కరరావును రంగంలోకి దించింది. అయినా ఇక్కడ ప్రభావం నామమాత్రమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement