
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటును చీల్చేందుకే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. జనం బాధలపై పవన్‌కు అవగాహన లేదని, కేవలం రాజకీయ అవకాశ వాదంతోనే యాత్ర పేరుతో రోడ్డెక్కారన్నారు.
ఇది సీఎం కేసీఆర్ కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా, సినిమా విభాగాల కన్వీనర్లు సుధాకరశర్మ, సీవీఎల్‌ఎన్ రావుతో కలసి మీడియాతో మాట్లాడారు. జనసేన స్థాపించి ఏళ్లు గడుస్తున్నా ఓ విధానం అంటూ లేదని విమర్శించారు.
కేసీఆర్, చంద్రబాబు భజన చేస్తూ పవన్ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. పవన్‌ది విడుదలకు ముందే ఫ్లాప్ అయిన పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తిట్టుకున్న కేసీఆర్, పవన్ ఇప్పుడు ఎందుకు ఒక్కటయ్యారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల హామీలు నెరవేర్చని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించాలని చెప్పారు.