వెలంపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు గుడివాడ , పేర్ని వెంకట్రామయ్య మచిలీపట్నం
ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. కృష్ణా జిల్లా నుంచి ముగ్గురిని అమాత్య పదవులువరించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డివెన్నంటి ఉండి.. ఆయనకు సన్నిహితులుగా పేరున్న మచిలీపట్నం, గుడివాడఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)లతోపాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కుమంత్రులుగా అవకాశం దక్కింది. శనివారం జరిగే ప్రమాణ స్వీకారానికిరావాల్సిందిగా ముగ్గురికి సీఎం పేషీ నుంచి సమాచారం అందింది. దీంతోనేతలు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు రాజధాని బాట పట్టారు.
సాక్షి, అమరావతి బ్యూరో: విధేయతకు పట్టం కడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. సీఎం వైఎస్ జగన్‌కు అండగా ఉన్న పేర్ని నాని, కొడాలి నానిలకు కేబినెట్‌లో స్థానం ఖరారైంది. పేర్నినాని తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ 2004లో కాంగ్రెస్ తరఫున మొదటిసారి బరిలో దిగి గెలుపొందారు. తర్వాత 2009లోనూ ఆయన ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఉండగానే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మంత్రి కొల్లురవీంద్రపై గెలుపొందారు. ఇక గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. నాని మొదట రెండు పర్యాయాలు టీడీపీతరఫున గెలుపొందగా.. 2014లో వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగిన కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలనేపట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేసినా.. ఆయన విజయాన్ని అడ్డుకోలేకపోయారు. కొడాలి నాని సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మొదటిసారి 2009లో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు.
బందరు నుంచి ఐదో మంత్రి..
రాజకీయ పరంగా ఎంతో ప్రత్యేక స్థానం ఉన్న బందరు నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నుంచి గెలుపొందిన వారు మంత్రులుగా పదవులు అలంకరించిన చరిత్ర మచిలీపట్నం నియోజకవర్గానికి ఉంది. 1984లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వడ్డి రంగారావుకు మంత్రి పదవి వరించింది. తర్వాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి పేర్ని కృష్ణమూర్తి మంత్రి పదవి చేపట్టారు. చంద్రబాబు సారథ్యంలో నడకుదటి నరసింహారావు, 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన అల్లుడు కొల్లు రవీంద్రలు అమాత్యులుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున రెండు పర్యాయాలు విజయం సాధించిన పేర్ని వెంకట్రామయ్య(నాని) 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.
టీడీపీ కోటలు బద్దలు కొట్టిన నాని..
రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు తొలిసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. ఈ నియోజకవర్గం నుంచే. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ స్థానం ఆ పార్టీకి పట్టుగొమ్మగా నిలిచింది. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో రెండు పర్యాయాలు కొడాలి నాని టీడీపీ తరఫున గెలుపొందారు. అయితే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాక.. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కోటలకు బీటలు వారాయి. వైఎస్సార్ సీపీ తరఫున బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. అప్పటి వరకు ఉన్న టీడీపీకి పట్టుగొమ్మగా నిలిచిన ఆ నియోజకవర్గంలో తొలిసారి వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. ఆ తర్వాత ఆ పంథాను కొనసాగిస్తూ 2019 ఎన్నికల్లోనూ ఆయన ఘన విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment