రాహుల్‌గాంధీ జేజమ్మ దిగొచ్చినా..  | KTR fires on revanth reddy and congress party | Sakshi
Sakshi News home page

రాహుల్‌గాంధీ జేజమ్మ దిగొచ్చినా.. 

Published Thu, Nov 2 2017 2:45 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

KTR fires on revanth reddy and congress party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :‘టీఆర్‌ఎస్‌కు బాసులు హైదరాబాద్‌లో ఉన్నరు.. కాంగ్రెస్‌ లెక్క ఢిల్లీలో కాదు. రాహుల్‌ గాంధీ కాదు కదా వాళ్ల జేజమ్మ దిగొచ్చినా మమ్మల్ని, మా విజయాన్ని ఆపలేరు. మళ్లీ ఎన్నికలొచ్చినా కేసీఆర్‌ సీఎం అయితడు. గులాబీ దండయాత్ర కొడంగల్‌ నుంచే ప్రారంభమైతది’అని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ కండువాలు కప్పి పలువురు నేతలను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. 

రాహుల్‌ది కుటుంబపాలన కాదా? 
కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ గంభీరమైన ప్రకటనలు చేశారని, మరి రాహుల్‌ గాంధీది కుటుంబపాలన కాదా.. ఉత్తమ్, ఆయన భార్య ఎమ్మెల్యేలు కాదా అని ప్రశ్నించారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెసోళ్లు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు తమకు తెలియవని కొడంగల్‌ నేతలు చెప్పారని, రేవంత్‌ పెద్ద తురుమ్‌ఖాన్‌లాగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. స్కాంల మయమైన కాంగ్రెస్‌లో మరో దొంగ చేరాడని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి చిప్పకూడు తిని, తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. ‘2014లో రాహుల్‌గాంధీ ఏమీ చేయలేకపోయారు. రేవంత్‌ ఏం చేస్తాడు. రేవంత్‌ గొంగట్లో కూర్చొని వెంట్రుకలు ఏరుతుండు. రైఫిల్‌ రెడ్డి, పిట్టల దొరలా మారిండు’అని వ్యాఖ్యానించారు.  

రెండు సార్లు గెలిచి ఏం చేశాడు? 
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్‌ ఏం చేశాడని ప్రశ్నించారు. 5 దశాబ్దాల వెనుకబాటుతనం కొడంగల్‌లో ఉందని పేర్కొన్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ మోసం చేసిందని, 2014లో తెలంగాణ ఇవ్వకపోతే చీపురు పట్టుకుని కొడతారనే భయంతో ఇచ్చిందని పేర్కొన్నారు. పాలమూరు నుంచి ముంబైకి ఎంతో మంది వలసలు వెళ్లడానికి కాంగ్రెసు పాలకులే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. కొడంగల్‌లో 30 పడకల ఆస్పత్రి ప్రారంభమైందని, రోడ్లు, నీళ్లు ఇస్తున్నది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి మూడేళ్లలో చేశామని, రేవంత్‌ ఎమ్మెల్యేగా ఉండి కొడంగల్‌ పరువు తీశాడని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.  

చేరిన నేతలు వీరే.. 
కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పి.దామోదర్‌రెడ్డి, ఎంపీపీ వైస్‌ ప్రెసిడెంట్‌ నర్సింహులు, ఎంపీటీసీ సభ్యుడు ఎల్లేశం, సహకార సంఘం డైరెక్టర్లు ఖాసీం, దేవమ్మ, అంతారం సర్పంచ్‌ సత్యంరెడ్డి, కొడంగల్‌ ఎంపీపీ ప్రతాపరెడ్డి, కోస్గి వైస్‌ ఎంపీపీ డి.రాజేశ్వర్, ఎంపీటీసీ సభ్యులు కె.భూదేవి, పద్మమ్మ, కొత్తపల్లి సర్పంచ్‌ సరోజనమ్మ, బోవన్‌పల్లి సర్పంచ్‌ లక్ష్మమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శంకరయ్య, మాజీ సర్పంచ్‌ బి.మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.  

వారంలోగా నివేదిక రూపొందించండి
సిరిసిల్ల వస్త్ర పారిశ్రామికవాడపై అధికారులకు  కేటీఆర్‌ ఆదేశం  
సిరిసిల్ల వస్త్ర పారిశ్రామికవాడకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను వారంలోగా రూపొందించాలని అధికారు లను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. సిరిసిల్లలో చేనేత శాఖ కార్యక్రమాలపై బుధవారం ఇక్కడ చేనేత శాఖ, టీఎస్‌ఐఐసీ, సిరిసిల్ల కలెక్టర్‌తో మంత్రి సమీక్ష నిర్వహించారు. సిరిసిల్లలో కార్మికుల కోసం ఏర్పాటు చేయనున్న గ్రూపు వర్క్‌ షెడ్ల కార్యక్రమాన్ని మండెపల్లి నుంచి పెద్దూరుకు మార్చాలని కేటీఆర్‌ ఆదేశించారు. కార్మికుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రూపు వర్క్‌ షెడ్ల కార్యక్రమా నికి రూ. 203 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.  షెడ్ల కార్యక్రమంలో రూ. 2 లక్షలతో ఒక్కో లూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 50 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు లింకేజీ, 20 శాతం కార్మికుల భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కులో కామన్‌ ఫెసిలిటీస్‌ సెంటర్‌ నిర్మాణంపై మంత్రి ఆరా తీశారు. నగరంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులు, నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణ జాప్యం పట్ల ఆర్‌అండ్‌బీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement