గెలుపు గుర్రాల వేట! | KTR resisting KCR's list of MLAs? | Sakshi
Sakshi News home page

గెలుపు గుర్రాల వేట!

Published Tue, Sep 11 2018 2:41 AM | Last Updated on Tue, Sep 11 2018 2:41 AM

KTR resisting KCR's list of MLAs? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల వ్యూహాల్లో టీఆర్‌ఎస్‌ వేగంగా దూసుకెళ్తోంది. ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో, ప్రచార నిర్వహణలో అన్ని విషయాల్లో ముందుంటోంది. టీఆర్‌ఎస్‌ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్టానం మిగిలిన 14 సెగ్మెంట్లకు సైతం అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తిచేసింది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌కు హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్థానం ఖరారైంది.

రెండు మూడు రోజుల్లో దానం టికెట్‌పై పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గోషామహల్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌కు మంత్రి కేటీఆర్‌ సర్దిచెప్పారు. పెండింగ్‌ స్థానాల అభ్యర్థుల ఖరారు విషయంలో మంత్రి కేటీఆర్‌ కసరత్తు పూర్తి చేశారు. వీటిలో సగానికిపైగా బీసీ అభ్యర్థులకు కేటాయించేలా నిర్ణయం జరిగినట్లు తెలిసింది. అలాగే ఉప్పల్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత బండారి లక్ష్మారెడ్డి సోమవారం కేటీఆర్‌ను కలిశారు. బుధవారం ఆయన అధికారికంగా పార్టీలో చేరుతారు.

వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీని వీడటం ఖాయమవడంతో ఇక్కడ సరైన అభ్యర్థి కోసం పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. మాజీ మంత్రి బస్వ రాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, గుడిమల్ల రవికుమార్‌ పేర్లను కేటీఆర్‌ పరిశీలిస్తున్నారు. అంబర్‌పేట స్థానానికి కాలేరు వెంకటేశ్‌ పేరు దాదాపు ఖరారైంది. మేడ్చల్‌ స్థానాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి ఆశిస్తున్నారు.

మల్కాజ్‌గిరి స్థానాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావుకు గానీ, ఆయన సూచించే మరో నేతకు గానీ ఇవ్వనున్నారు. ముషీరాబాద్‌ స్థానం కోసం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, మరో నేత ముఠా గోపాల్‌ ప్రయత్నాలు తీవ్రం చేశారు. ముఠా గోపాల్‌వైపే టీఆర్‌ఎస్‌ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలిసింది. ఖైరతాబాద్‌ టికెట్‌ను టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి, పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి, ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్‌ రెడ్డి ఆశిస్తున్నారు.

వచ్చేవారం కేసీఆర్‌ సభ!
ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ వచ్చే వారంలో మరో బహిరంగ సభ నిర్వహించనుంది. వినాయక చవితి నేపథ్యంలో ఈ వారం విరామం ఇచ్చి వచ్చే వారం సభ నిర్వహించి వరుస గా కొనసాగించాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. వచ్చే వారం బహిరంగ సభ కోసం మహ బూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడ సభ నిర్వహించాలనే విషయంపై తుది నిర్ణయం జరగాల్సి ఉంది.

అసంతృప్తులకు కేటీఆర్‌ బుజ్జగింపులు..
పెండింగ్‌ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియతో పాటు టికెట్‌ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నేతలకు సర్దిచెప్పే బాధ్యతలను కేటీఆర్‌ చూసుకుంటున్నారు. టికెట్‌ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన నేతల వద్దకు తన తరపున పార్టీ ముఖ్యులను పంపిస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో చర్చించే బాధ్యతను మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు అప్పగించారు. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బొంతు మూడు రోజులుగా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాలలో అసంతృప్తులను సోమవారం మంత్రి కేటీఆర్‌ వద్దకు తీసుకొచ్చారు.


అభ్యర్థులపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
శేరిలింగంపల్లి టికెట్‌ ఆశించి భంగపడ్డ మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ అసంతృప్తితో ఉన్నారు. జగదీశ్వర్‌గౌడ్‌తో పాటు ఆయన భార్య పూజిత హఫీజ్‌పేట కార్పొరేటర్‌గా ఉన్నారు. బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఉదయమే జగదీశ్వర్‌గౌడ్‌ ఇంటికి వెళ్లారు. జగదీశ్వర్‌గౌడ్‌ సతీమణి పూజిత ఆధ్వరంలోని అక్కడి స్థానిక నేతలతో కేటీఆర్‌ క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. తాజా మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై మంత్రి కేటీఆర్‌కు వారు ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్‌ టికెట్‌ను మాగంటి గోపీనాథ్‌కు కేటాయించడంతో నియోజకవర్గంలోని దాదాపు అందరు కార్పొరేటర్లు అసంతృప్తిగానే ఉన్నారు. వారందరినీ బొంతు రామ్మోహన్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మంత్రితో మాట్లాడించారు. గోపీనాథ్‌పై అందరూ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోసం కలసి పని చేయాలని అందరికీ సూచించారు.
 ♦ ఎల్బీనగర్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌ ప్రకటించిన రామ్మోహన్‌గౌడ్‌పై అక్కడి మెజారిటీ కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు. ముగ్గురు మినహా నియోజకవర్గంలోని అందరు కార్పొరేటర్లూ మంత్రి కేటీఆర్‌కు వద్దకు వచ్చారు. రామ్మోహన్‌గౌడ్‌ వ్యవహారశైలితో పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పారు. బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కార్పొరేటర్లతో చర్చల సమావేశంలో ఉన్నారు. మంత్రి కేటీఆర్‌ ఎంత సర్ది చెప్నినా ఎల్బీనగర్‌ కార్పొరేటర్లు అసంతృప్తితోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 ఖమ్మం జిల్లా మధిర టికెట్‌ ఆశించిన బొమ్మెర రామ్మూర్తి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రామ్మూర్తి వచ్చారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని, పార్టీలో సముచిత స్థానం ఉంటుందని రామ్మూర్తికి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తామని రామ్మూర్తి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement