చిలకలగూడ ఎస్వీఎస్ గల్లీ వద్ద మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు
చిలకలగూడ: దేశంలో మతం పేరిట చిచ్చు పెట్టేవాళ్లను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సీతాఫల్‌మండి డివిజన్ చిలకలగూడ ఎస్వీఎస్ గల్లీ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ... దేశంలో ఉన్నవాళ్లంతా హిందువులేనని, మతం, మందిరం అంటూ ఓట్ల కోసం వచ్చే రాజకీయ హిందువులకు సరైన రీతిలో గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలోనే బీజేపీకి రాముడు గుర్తుకు వస్తాడని, పెద్దనోట్ల రద్దుతో మహిళలు పోపుల పెట్టెల్లో దాచుకున్న సొమ్మంతా నరేంద్రమోడీ దోచుకున్నారన్నారు. బీజేపీవి తాటాకు చప్పుళ్లని, కేంద్ర మంత్రిగా, సికింద్రాబాద్ పార్లమెంటేరియన్‌గా బండారు దత్తాత్రేయ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా అని ప్రశ్శించారు.
తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ను గెలిపిస్తే ఢిల్లీలో అడు క్కునే స్థాయి నుంచి ఆదేశించే స్థాయికి చక్రం తిప్పవచ్చన్నారు. సికింద్రాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం ఎవరినీ దేబిరించే అవసరం ఉండదని, ఇక్కడ ఉన్న రైల్వేస్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే వెసులుబాటు కలుగుతుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటు సికింద్రాబాద్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అభ్యర్థి తలసాని సాయి కిరణ్‌యాదవ్ అన్నారు. డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు, మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు.
బన్సీలాల్‌పేట్‌లో...
బన్సీలాల్‌పేట్: హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిందేమీ లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్‌కు మద్దతుగా శుక్రవారం రాత్రి బన్సీలాల్‌పేట్‌లో జరిగిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. సనత్‌నగర్ ప్రజలను గౌరవించి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కే కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చి గౌరవించారన్నారు. సాయికిరణ్ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment