సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ని అజేయ శక్తిగా తీర్చిదిద్దుతానని, రాష్ట్రంలో 100 ఏళ్లు నిలిచిపోయేలా పార్టీని పటిష్ట పరుస్తానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాక రామారావు పేర్కొన్నారు. సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవీబాధ్యతలు స్వీకరణ అనంతరం తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు. మన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ను రాష్ట్రంలోని అన్ని మతాలు, వర్గాలు, కులాల ప్రజలు ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆశీ ర్వదించారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కాంక్షతో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 4కోట్ల మంది ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించే పనిలో కేసీఆర్ నిమగ్నమై ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.
కాబట్టి, టీఆర్‌ఎస్ అంటే భవిష్యత్తులో ‘తిరుగులేని రాజకీయ శక్తి’గా మలచాలన్న సంకల్పంతో పెద్దలు కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతను నాకు అప్పజెప్పారు. మీ అందరి ఆశీస్సులతో, మీలో ఒకడిగా తెలంగాణలోని అన్ని వర్గాలకు అండగా ఉంటూ ముందుకు సాగుతూ పార్టీని అజేయశక్తిగా మలుస్తా. ఈ క్రమంలో మీ అందరి ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తు న్నా. మీ ఆశీర్వాదంతో కేసీఆర్ నాపై పెట్టిన బాధ్యతను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తా. 100 ఏళ్లపాటు టీఆర్‌ఎస్ ప్రజల సేవలో నిమగ్నమయ్యే విధంగా సంస్థాగతంగా పటిష్ట కార్యచరణ రూపొందిస్తా. పార్టీని బలోపేతం చేస్తా. పార్టీ కార్యాలయాలు నిర్మించి పార్టీ శిక్షణ కార్యక్రమాలు చేపడతా. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా పార్టీని నిర్మిస్తా. ఈ క్రమంలో భగవంతుడు నాకు ఇచ్చిన శక్తినంతా ధారపోస్తానని హామీ ఇస్తున్నా. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ వినమ్రంగా పేరుపేరునా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’అని కేటీఆర్ పేర్కొన్నారు.
పెద్దల ఆశీర్వాదంతో...
అంతకుముందు కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. తొలుత ప్రగతి భవన్ లో కేటీఆర్ తల్లిదండ్రుల తరఫు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత సోదరుడు కేటీఆర్‌కు తిలకం దిద్దారు. ‘టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకమైన పాత్ర పోషించబోతున్న నా ప్రియమైన సోదరుడికి శుభాకాంక్షలు’అని ట్వీట్ చేశారు. అనంతరం కేటీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరగా భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సందడి మొదలైంది. బోనాలు, బతుకమ్మలు, కోలాటాలు, ఒగ్గుడోలు, పులివేషాలు, డప్పులు, గుస్సాడీ, కొమ్ముకొయ్యలు, చిందుయక్షగానాల ప్రదర్శనలతోపాటు బంజరాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు చేపట్టిన భారీ ర్యాలీ మధ్య కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన టీఆర్‌ఎస్ శ్రేణులతో కేన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ మధ్య మార్గం కిక్కిరిసిపోయింది.
‘కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి... కేటీఆర్ జిందాబాద్’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్ ముందుగా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాంబర్‌లోకి వెళ్లారు. టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తల కోలాహలం, వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ఉదయం 11.55 గంటలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ముఖ్యనేతలు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీని వాస్‌యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, టి.పద్మారావుగౌడ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేశ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్‌ఎస్ కార్యవర్గ ముఖ్యులు పాల్గొన్నారు. కేటీఆర్‌కు వారంతా శుభాకాంక్షలు తెలిపారు.
నేడు సిరిసిల్లకు కేటీఆర్...
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తొలిసారిసొంత నియోజకవర్గమైన సిరిసిల్లకు మంగళవారం వెళ్లనున్నారు. భారీ మెజార్టీతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపనున్నారు. కేటీఆర్ జిల్లాల పర్యటన ఖరారైంది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించనుంది. బుధవారం వరంగల్‌లో ఈ సభ జరగనుంది. అన్ని జిల్లాల్లోనూ ఈ సభలు నిర్వహించనున్నారు. కేటీఆర్ ఈ పర్యటనల్లోనే అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment