న్యూఢిల్లీ : హరియాణా కాంగ్రెస్ నూతన సారథిగా కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా నియమితులయ్యారు. ఈ ఏడాది చివర్లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ముఖ్య నాయకుల మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సెల్జా నియామకం వైపు మొగ్గు చూపింది.
దళిత సామాజిక వర్గానికి చెందిన సెల్జా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి సెల్జా సన్నిహితురాలుగా ఉన్నారు. రాష్ట్రంలో 19 శాతం ఉన్న దళిత ఓటర్లను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెల్జా తండ్రి చౌదరి దల్వీర్‌సింగ్ కూడా హరియాణా కాంగ్రెస్ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. తనను కాంగ్రెస్ చీఫ్‌గా నియమించడంపై స్పందించిన సెల్జా.. ఇది తనపై బాధ్యతను మరింతంగా పెంచిందని తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాననని స్పష్టం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉన్న అశోక్ తన్వార్, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌కు మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అశోక్ తన్వార్‌ను పీసీసీ అధ్యక్ష బాధ్యతల తొలగించాలని భూపిందర్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భూపిందర్‌సింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని అశోక్ కోరుతున్నారు. అయితే ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ అధిష్టానం సెల్జాకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. భూపిందర్‌సింగ్‌ను పార్టీ ఎలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. కాగా, 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment