విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్నవైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు
కాకినాడ: విభజన చట్టం ప్రకారం కేంద్రం చేపట్టాల్సిన రాజధాని నిర్మాణానికి ప్రజల నుంచి అప్పులు ఇవ్వాలని కోరుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు అత్యంత హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌ఎంబీ ప్రకారం రుణాలు తీసుకునే వీలు లేదని తెలిసినప్పటికీ ప్రత్యేక హోదా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు రాబట్టలేక ఆచరణ సాధ్యం కాని విధంగా ప్రజలను అప్పులు అడగడం, వాటికి బ్యాంకులకన్నా అదనపు వడ్డీలు ఇస్తామని చెప్పడాన్ని చూస్తే చంద్రబాబు వ్యవహార శైలి అంతుబట్టని విధంగా ఉందన్నారు. ఆయన తనయుడు లోకేష్ మరో అడుగు ముందుకు వేసి ప్రతి రైతూ రాజధాని నిర్మాణం కోసం ధాన్యం బస్తా ఇవ్వాలని కోరుతున్న తీరు మరింత విడ్డూరంగా ఉందన్నారు. ఓ వైపు రాజధాని నిర్మాణం కోసం రూ.1500 కోట్లు నిధులు ఇచ్చామని కేంద్రం, ఇవ్వలేదని రాష్ట్రం చెబుతోందని, ముందుగా ఈ అంశంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కన్నబాబు డిమాండ్ చేశారు. కేంద్రం చెబుతున్న ఆ నిధులు ఏమయ్యాయని కన్నబాబు నిలదీశారు.
ఇసుక, మట్టితోసహా రాష్ట్రాన్ని సర్వం దోచుకుంటున్న టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, జన్మభూమి కమిటీ సభ్యుల వద్దే కావలసినంత సొమ్ములున్నాయని, వారి నుంచి నిధులు సేకరించుకోవాలని కన్నబాబు హితవు పలికారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తుంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తమ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టి రాద్ధాంతం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రధానికి హుందాగా నమస్కరిస్తే ఆయన కాళ్లకు మొక్కినట్టుగా చిత్రీకరించి తప్పుడు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికే లక్షా 20 వేల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు సర్కార్ ఆ నిధుల్లోంచి రూ.10 వేల కోట్లు వెచ్చించి ఉంటే రాజధాని నిర్మాణం అయ్యేదన్నారు. రాజధాని నిర్మాణాన్ని బాహుబలి సెట్టింగ్స్ తరహాలో చూపిస్తూ మసిపూసి మారేడుకాయ చేసి చూపించారని మండిపడ్డారు. ప్రధాని ‘నీరు–మట్టి’ తెచ్చిన సమయంలోనే చంద్రబాబు గట్టిగా ప్రశ్నించి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యేదికాదన్నారు. హోదా కోసం ఉద్యమిస్తే జైలులో పెడతామని, కేసులు పెడతామని హెచ్చరికలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి హోదా కావాలనడం ఆయన ద్వంద్వనీతికి అద్దం పడుతుందన్నారు.
రాజీనామాలకు సిద్ధమా?
ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమా? అని కన్నబాబు నిలదీశారు. ఒకేసారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలంతా రాజీనామాలు చేస్తే కేంద్రంలో కదలిక వస్తుందన్నారు. ఈ దిశగా టీడీపీ ఎందుకు ముందడుగు వేయలేకపోతుందని కన్నబాబు నిలదీశారు. ఏదైనా సాధించాలంటే పోరాటాలు, త్యాగాలు చేయాలని, అందుకు తమ పార్టీ సన్నద్ధంగా ఉందన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు కర్ణాసుల సీతారామాంజనేయులు, కోమలి సత్యనారాయణ, నురుకుర్తి రామకృష్ణ, గీసాల శ్రీను, , వాసిరెడ్డి సూరిబాబు, కోరాడ దుర్గాప్రసాద్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment