
సోమవారం గాంధీభవన్‌లో మాట్లాడుతున్న కుష్బూ. పక్కన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి కుష్బూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 8 లేదా 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలిసి కుష్బూ సోమవారం గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి గాంధీ భవన్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కుష్బూ ఆరోపించారు. జీఎస్టీతో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఉద్యోగాలు, దేశ ప్రగతి కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ.72 వేలు ఇస్తాం. ప్రతి నెలా రూ.6 వేల చొప్పున మహిళల అకౌంట్‌లోనే వేస్తాం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మారుస్తామని అంటున్నారు. మరి హైదరాబాద్ బిర్యానీని భాగ్యనగరం బిర్యానీ అనాలా? కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో రుణమాఫీ చేశాం. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశం మొత్తం రుణమాఫీ చేస్తాం. దేశ ప్రగతి ఒక్కటే మా నినాదం. మాకు వేరే ఎజెండాలు లేవు. బీజేపీ మేనిఫెస్టోలో కొత్తగా ఏమి లేదు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్. ఇలాంటి వారిని గెలిపించడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది. చేవెళ్ల ప్రజలకు విశ్వేశ్వర్‌రెడ్డి చాలా అవసరం. అందుకే ఆయనను గెలిపించుకోండి’అని అన్నారు. మహిళలకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ ఒక జోక్‌లాగా మారిపోయిందని విమర్శించారు.