రాజ్యసభలో నిరసన తెలుపుతున్న ఎంపీ కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలంటూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఓ వైపు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనతో టీడీపీ ఎంపీలు దాదాపు తమ పోరాటాన్ని ఆపేయగా, రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సైతం ఈ విషయంలో వెనక్కి తగ్గారు. రాజ్యసభలో ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీ రామచంద్రరావు ప్లకార్డుతో పోడియం వద్ద నిరసన తెలిపారు. అయితే వెంటనే స్పందించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఇది సరైన విధానం కాదని, ఈరోజు కేవీపీని అనుమతిస్తే రేపు మరొకరు ఇలా నిరసన చేస్తారన్నారు.
ఇలా అయితే సభను సజావుగా నడపలేనని, వాయిదా వేస్తానని వెంకయ్య హెచ్చరించారు. కేవీపీని తన సీట్లో కూర్చునేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలని చైర్మన్ వెంకయ్య కోరారు. సభలో ఇలాంటి చర్యలకు సహకరించబోమని వెంకయ్యకి గులాం నబీ ఆజాద్ వివరణ ఇచ్చుకున్నారు. నిబంధన 255 కింద ఎంపీ కేవీపీ తన హాజరును ఉప సంహరించుకొని, సభ నుంచి నిష్క్రమించాలని చైర్మన్ ఆదేశించారు. దీంతో చేసేదేం లేక వెనక్కి తగ్గిన కేవీపీ చైర్మన్ ఆదేశానుసారం నిరసనను విరమించి తన సీట్లో కూర్చోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment