
సాక్షి, హైదరాబాద్: ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ సీఎం కేసీఆర్ బీసీలను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ‘బీసీల మహా సంగ్రామ సదస్సు’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీల జనాభా 54 శాతమున్నా సీఎం కేసీఆర్ వారి గురించి ఎందుకు ఆలోచించడంలేదని ప్రశ్నించారు. ఐదేళ్లలో బీసీలకు రూ. 25 వేల కోట్లను ఖర్చు చేస్తామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పటివరకు రూ.15 వేలకోట్లు ఖర్చుచేయాల్సి ఉండగా రూ.3 వేల కోట్లు కూడా ఖర్చుచేయలేదన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చి, బీసీ–ఈ కేటగిరీలో చేర్చడం ద్వారా బీసీలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరింత అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాటం నర్సింహ్మ యాదవ్ అధ్యక్షత వహించిన సదస్సులో ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
త్వరలో తెలంగాణలో మోదీ పర్యటన: కె.లక్ష్మణ్
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు కె.లక్ష్మణ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలుస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు. గుజరాత్ ఎన్నికల తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 3 రోజులు రాష్ట్రంలో పర్యటిస్తారని లక్ష్మణ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment