విలేకరులతో మాట్లాడుతున్న నందమూరి లక్ష్మీపార్వతి
రాయవరం (మండపేట): ‘మంగళగిరిని మందలగిరి అని పలుకుతున్న లోకేశ్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియకపోయినా..మూడు మంత్రిత్వ శాఖలివ్వడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని’ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేని చంద్రబాబు తన సొంత కొడుక్కు మాత్రం దొడ్డిదారిన మంత్రి పదవి కట్టబెట్టారన్నారు.లోకేశ్‌ను సీఎం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేస్తున్న చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
అధికార పార్టీ తొత్తులు పోలీసులు
ముఖ్యమంత్రి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా దిగజార్చారని లక్ష్మీపార్వతి అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
జగన్‌కు ఓటేస్తే...
చంద్రబాబు కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్‌పై అనేక రకాలుగా కేసులు పెట్టించి వేధింపులకు గురిచేసినా వెరవక పోవడం ఆయనలోని ధైర్యానికి, నిబద్ధతకు నిదర్శనమని లక్ష్మీపార్వతి అన్నారు. అలాంటి నేతను సీఎంని చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. తొమ్మిదేళ్లు ప్రజల కోసం పోరాటం చేస్తున్న జగన్ నాయకుడా..లేదంటే తల్లిచాటున ఉండి ఓనమాలు రాని వ్యక్తి నాయకుడా? అని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేసుకున్నట్లేనని, రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అయినట్టేనని, యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లేనని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment