![Lalu Prasad Yadav responds CBI Special court verdict on Fodder scam case - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/23/parliament-session-prasad-m.jpg.webp?itok=rgvahoik)
రాంచీ : దాణా కుంభకోణం కేసులో సీబీఐ వెలువరిచిన సంచలన తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. తనను దోషిగా తేల్చడంపై లాలూ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ డర్టీ గేమ్ ఆడుతుందంటూ విమర్శల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని.. న్యాయకోసం తమ పోరాటం కొనసాగిస్తామంటూ పేర్కొన్నారు.
చివరికి న్యాయమే గెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు. నిజం చెప్పులేసుకునే లోపే.. అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటూ ఆరోపించారు. కోర్టు తీర్పు ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమే అంటూ లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ కూడా మండిపడుతోంది. సాక్ష్యాలను తారుమారు చేశారని, ఈ కేసులో న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తామంటూ పేర్కొంది.
కాగ, నేడు వెలువరిచిన దాణ కుంభకోణం కేసులో లాలూని సీబీఐ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. లాలూతో పాటు 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టులోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు.
1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసిన క్రమంలో సీబీఐ ఈ కేసు నమోదుచేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment