సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. మాజీమంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. టీడీపీ దాడులు చేస్తూ...పై పెచ్చు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడుతుందంటూ లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వైఎస్సార్ సీపీ దాడులు చేస్తోందని, తమ పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దంటూ లోకేశ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
దీనిపై హోంమంత్రి ఘాటుగా స్పందిస్తూ ఇటీవల జరిగిన గొడవల్లో టీడీపీ వాళ్లు 44మంది గాయపడితే తమ పార్టీ వాళ్లు 57మంది గాయపడ్డారన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ముఖ్యమంత్రి ఎప్పుడో చెప్పారని, అయినా టీడీపీ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. ఘర్షణల్లో వైఎస్సార్ సీపీకి చెందినవారే అధికంగా గాయపడ్డారన్నారు. ఉనికి కోల్పోతున్నామన్న భయంతో టీడీపీ వాళ్లు దాడులకు తెగబడుతున్నారని, మహిళా అధికారిని కొట్టినా పట్టించికోని పరిస్థితి అప్పట్లో ఉండేదన్నారు. అన్యాయాన్ని నిలదీసిన ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని, తమ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని సుచరిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment