
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విధిలేక, చేతగాక అవినీతి కూటములు కడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర విభజనకు కేంద్రం ఓకే చెప్పగానే, దానిని వ్యతిరేకిస్తూ కృత్రిమ ఉద్యమం నడిపిన టీడీపీతో కాంగ్రెస్‌పొత్తు పెట్టుకుంటోందని విమర్శించారు. ఉద్యమద్రోహులతో టీజేఎస్ అధినేత కోదండరాం ఎలా పొత్తుపెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ను మంగళవారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ వెల్లడించారు. రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారంటే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు దడ పుడుతోందన్నారు. మూడుసార్లు వస్తేనే వారికి ముచ్చెమటలు పట్టాయని, ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పర్యటనతో రాష్ట్రంలో రాజకీయం మారిపోతుందన్నారు.
భయంలేకపోతే పొత్తులెందుకు?
119 స్థానాల్లో గెలుపుగుర్రాలను తాము పోటీలో దింపుతామంటే కాంగ్రెస్‌లో ఎందుకు కలవరం పుడుతోందని లక్ష్మణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు భయం లేకపోతే టీడీపీ, సీపీఐలతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నదని, టీఆర్‌ఎస్ –ఎంఐఎం ఎందుకు ఒక్క టవుతున్నాయని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాం గ్రెస్ పరిస్థితి ఇదేనని పేర్కొన్నారు. గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలనుకునే కుట్రలు తెలంగాణలో చెల్లవని చెప్పారు. ఈ నెల 10న కరీంనగర్‌లో జరిగే సభలో అమిత్ షా ప్రజలకు భరోసా ఇస్తారన్నారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.
ఈ నెల 10న అభ్యర్థుల ప్రకటన ఉండదని, జాబితాను రూపొందించి అధిష్టానానికి పంపిస్తామని, ఆ తరువాత ప్రకటన చేస్తామన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు దశలవారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. పరిపూర్ణానంద స్వామి సేవలను అవసరమైన మేరకు పార్టీ వినియోగించుకుంటుందని చెప్పారు. సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించే ఆన వాయితీ బీజేపీలో లేదన్నారు. డిసెంబర్ 12న తెలంగాణలో కాషాయజెండా రెపరెపలాడుతుంద న్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడినవారిపై ఈడీ, ఐటీ, ఏసీబీ దాడులు చేస్తుం టే కాంగ్రెస్‌కు ఎందుకు గుబులు పుడుతోందని ప్రశ్నించారు. సమావేశంలో నేతలు మల్లారెడ్డి, కృష్ణసాగర్‌రావు, కె.మాధవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment