సభలో ప్రసంగిస్తున్న లక్ష్మణ్
ఇబ్రహీంపట్నం: గడీల రాజ్యం కాదు.. గరీబోళ్ల రాజ్యం రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మార్పుకోసం జనచైతన్య యాత్ర’సోమవారం ఇబ్రహీంపట్నం చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి, అక్రమాలపై బీజేపీ యుద్ధం ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగానే మార్పుకోసం జనచైతన్య యాత్రను చేపట్టినట్టు తెలిపారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రానికి తొలి సీఎం కేసీఆర్ కావడం మన దౌర్భాగ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయని ఎన్నో ఆశలతో ఎదురు చూసిన విద్యార్థులు, యువత, నిరుద్యోగులను నాలుగేళ్ల కేసీఆర్ పాలన తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. దళిత సీఎం, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూ పంపిణీ, మూడు లక్షల ఉద్యోగాల భర్తీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కోటి ఎకరాలకు సాగునీరు తదితర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
అవి కమీషన్ల పథకాలు..: కేసీఆర్ సీఎం కుర్చీ ఎక్కగానే హామీలు విస్మరించి అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కమీషన్లు వచ్చే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను చేపట్టారని విమర్శించారు. 63 మంది ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య నేడు 90కి చేరుకుందంటే కేసీఆర్ ఫిరాయింపులను ఏ విధంగా ప్రొత్సహిస్తున్నారో స్పష్టమవుతోందన్నారు. టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తాయని సర్వేల్లో తేలిందని కేసీఆర్ జనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. మజ్లిస్ ఎజెండానే టీఆర్‌ఎస్ అమలు చేస్తోందని ఆరోపించారు.
మోదీ పథకాలకే పేరు మార్చి..
కేంద్రంలోని మోదీ సర్కార్ రూ.కోట్లాది నిధులు రాష్ట్రానికి మంజూరు చేసిందన్నారు. మోదీ పథకాలనే పేరు మార్చి తమ పథకాలుగా రాష్ట్ర సర్కార్ చెప్పుకొంటోందని దుయ్యబట్టారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుతో తెలంగాణ సర్కారు ఈ ప్రాంతాన్ని కాలుష్య పట్టణంగా మార్చి వేస్తోందన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ అ«ధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
కందుకూరు: రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆ పార్టీ చేపట్టిన జనచైతన్య యాత్ర సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చేరుకుంది. 70 సంవత్సరాల త్రిపుర చరిత్రలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. 37 శాతం ముస్లింలు ఉన్న అస్సాంలోనూ తమ పార్టీ పాగా వేసిందన్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ బోగస్ సర్వేలు తెలంగాణ భవన్‌కే పరిమితమని, ఒక్కసారి అమిత్‌షా, మోదీ రాష్ట్రంలో అడుగు పెడితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment