
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని 14 జిల్లాల పరిధిలో స్థానిక సంఘాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 39 సీట్లకు ఎన్నికలు జరగ్గా వాటిలో 21 సీట్లను పాలకపక్ష ఎల్‌డీఎఫ్ గెలుచుకోగా, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ 12 సీట్లను గెలుచుకొంది. ఇక బీజేపీకి రెండు సీట్లు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ)కు రెండు సీట్లు, స్వతంత్ర అభ్యర్థులు రెండు సీట్లు వచ్చాయి. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న పినరాయి విజయన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఫలితాలు రావడం విశేషం.
ముఖ్యంగా శబరిమల ఆలయం ఉన్న పట్టణంమిట్ట జిల్లాలోని రెండు సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని భావించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆరోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ, ఆరెస్సెస్ వర్గాలు భారీ నిరసన ప్రదర్శనలను నిర్వహించాయి. అయినప్పటికీ ఈ రెండు సీట్లలో ఒక సీటులో స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించగా, మరో సీటును ఎస్డీపీఐ అభ్యర్థి గెలుచుకున్నారు. అలప్పూజ జిల్లాలో మాత్రమే రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది.