వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎలాగైనా కన్నడ పీఠాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, తిరిగి చేజిక్కించుకోవాలని బీజేపీ ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. కొన్ని నెలలుగా సీఎం సిద్దరామయ్య తీసుకున్న ప్రజాకర్షక నిర్ణయాలు గెలుపు కలలు కంటున్న బీజేపీని ఇరకాటంలోకి నెట్టాయి.
అయితే 1985 నుంచీ ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం ఓడిపోవడం రివాజుగా మారింది. ఆ ఆనవాయితీ ఇప్పుడూ కొనసాగుతుందని బీజేపీ ఆశతో ఉంది. అయినా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తరచుగా కర్ణాటక పర్యటిస్తున్నారు. త్రిపురలో ఘనవిజయం సాధించిన బీజేపీ యూపీ లోక్‌సభ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది.
లింగాయత్‌లపై కాంగ్రెస్..రైతులపై బీజేపీ
బీజేపీకి గట్టి మద్దతుదారులైన లింగాయత్‌లలో చీలిక తెచ్చేందుకు వీరశైవ–లింగాయతుల ధర్మాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సర్కారు సిఫార్సును కేంద్రం ఆమోదిస్తేనే కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ప్రయోజనం దక్కుతుంది. ఈ నిర్ణయం బీజేపీకి కూడా ఇబ్బందికరమే. కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తే లింగాయత్‌లు అధికసంఖ్యలో నివసించే ఈశాన్య కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీకి విజయావకాశాలు తగ్గుతాయి.
ఉచిత బియ్యం పథకంతోపాటు స్కూళ్లలో ఉచితంగా పాలు, గుడ్ల సరఫరా, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు వంటి పలు సంక్షేమ పథకాల్ని కాంగ్రెస్ అమలు చేస్తోంది. సహకార బ్యాంకుల రుణాల మాఫీతో పాటు తక్కువ ధరకు భోజనం, ఆహారపదార్థాల సరఫరా కోసం ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్లు కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఇవన్నీ తమకు కలసి వస్తాయనే నమ్మకంతోఉంది. కర్ణాటకలో 80 లక్షల మంది రైతులే ఎన్నికల్లో జయాపజయాలు నిర్ణయిస్తారని భావిస్తున్నారు.
అందుకే తాము అధికారంలోకి వస్తే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. పాత మైసూరు ప్రాంతంలో పరిస్థితి కాంగ్రెస్, జేడీఎస్‌కు అనుకూలంగా ఉందని అంచనా. 2004 ఎన్నికల నాటి నుంచీ రాజధాని బెంగళూరు ప్రాంతం బీజేపీకి కంచుకోటలా మారింది. కోస్తాలో కూడా బీజేపీ ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ తేదీ నాటికి జనాదరణ పెరిగితే మెజార్టీ రాకున్నా అత్యధిక సీట్లు సాధించిన పెద్ద పార్టీగా బీజేపీ అవతరించవచ్చు. 25–35 సీట్లు సాధిస్తే జేడీ(ఎస్) ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుంది.
సర్వేలు ఏం చెప్పాయంటే
ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన మూడు సంస్థల ఎన్నికల సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఫిబ్రవరి 2న క్రియేటివ్ సెంటర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టడీస్ సంస్థ వెల్లడించిన ఫలితాల్లో.. మొత్తం 224 సీట్లలో బీజేపీకి 113, కాంగ్రెస్‌కు 85, జేడీఎస్‌కు 25 స్థానాలు రావచ్చని జోస్యం చెప్పింది. కర్ణాటకలో బీజేపీకి సాధారణ మెజారిటీ లభిస్తే వచ్చే డిసెంబర్‌లో జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరగొచ్చనే అంచనాలు జోరందుకున్నాయి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment