కాంగ్రెస్ పార్టీకి వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. దేశ స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించిన ఈ పార్టీ, స్వాతంత్య్రానంతరం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దేశాన్ని ఏలింది. 1990వ దశకం వరకు దేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఏళ్ల తరబడి హవా చెలాయించిన ఘన కీర్తి కలిగిన కాంగ్రెస్ ఆ ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం ఇంత వరకూ నెగ్గలేకపోయింది. ఆ నియోజకవర్గం కేరళలోని పొన్నాని. సముద్ర తీర పట్టణమైన పొన్నాని 1951లో పార్లమెంటు నియోజకవర్గం అయింది.
అప్పటి నుంచి ఇక్కడ కిసాన్ మజ్దూర్ పార్టీ ఒకసారి (1951), వామపక్షాలు మూడు సార్లు (1962, 67, 72), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 11 సార్లు (1977–2014) నెగ్గాయి. ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్‌ను మాత్రం ఒక్కసారి కూడా గెలిపించలేదు. 1951లో పొన్నాని ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అంటే ఇక్కడ నుంచి ఇద్దరు అభ్యర్థులు (ఒకరు జనరల్ కోటాలో మరొకరు ఎస్సీ కోటాలో) పార్లమెంటుకు ఎన్నికయ్యేవారు.
ఆ ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ఒక అభ్యర్థిని నిలబెట్టింది. కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను పోటీకి దించింది. కిసాన్ పార్టీ అభ్యర్థి కేలప్పన్ కొయహపలి జనరల్ అభ్యర్థిగా గెలిచారు. మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఇయచరణ్ ఇయాని ఎస్సీ కోటాలో ఎన్నికయ్యారు. ఈ సీటును దక్కించుకోవడానికి విఫలయత్నం చేసిన కాంగ్రెస్ 1977లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తో పొత్తు పెట్టుకుని తన అభ్యర్థిని నిలబెట్టడం మానేసింది. అప్పటి నుంచి ఇక్కడ ముస్లిం లీగ్ అభ్యర్థే గెలుస్తున్నారు.
ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ, ఒడిశాలోని కేంద్ర పారా లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు ఒకే ఒక్కసారి నెగ్గింది.1951 ఎన్నికల్లో కేంద్రపారాలో,1984లో హుగ్లీలో ఆ పార్టీ గెలిచింది. ఆ తర్వాత ఇంత వరకు ఆయా సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. అలాగే, 1967లో ఉనికిలోకి వచ్చిన అరంబాగ్(బెంగాల్)లో కాంగ్రెస్ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఆ సంవత్సరంలోనే ఏర్పాటయిన శ్రీనగర్(కశ్మీర్), బోల్‌పూర్(బెంగాల్) నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఇక ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే... కాంగ్రెస్ ఈసారి కూడా పొన్నానిలో పోటీ చేయడం లేదు. ఎన్నికల పొత్తులో భాగంగా శ్రీనగర్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టడం లేదు. కేంద్రపారా, హుగ్లీల్లో మాత్రం పోటీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment