దేవుడి సాక్షిగా మాట మార్చిన లోకేశ్‌..! | Lokesh Babu Refuse Invitation To Enter Into Church In Guntur | Sakshi

దేవుడి సాక్షిగా మాట మార్చిన లోకేశ్‌..!

Mar 20 2019 12:00 PM | Updated on Mar 20 2019 12:05 PM

Lokesh Babu Refuse Invitation To Enter Into Church In Guntur - Sakshi

‘దేవుడి దగ్గరకు మీరు రారా.. దేవుడే మీ దగ్గరకు రావాల్నా’ అంటూ ప్రశ్నలు కురిపించడంతో అవాక్కయిన లోకేశ్‌ మాట మార్చారు.

సాక్షి, తాడేపల్లిరూరల్‌: ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని సీఎం చంద్రబాబు.. మేం తక్కువ తిన్నామా అంటూ ఎస్సీలు శుభ్రంగా ఉండరు అని మంత్రి ఆది.. మాదిగలు చదువుకోరంటూ వర్ల రామయ్య.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు అంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలు ప్రజల మదిలో తిరుగుతుండగానే.. సీఎం కుమారుడు, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ మరోసారి దళితులను ఘోరంగా అవమానించారు. మంగళవారం మండలంలోని నవులూరులో లోకేశ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాప్టిస్ట్‌పేట చర్చిలోకి రావాల్సిందిగా సంఘపెద్దలు, పాస్టర్‌ ఆహ్వానించగా తాను రానని, చర్చిలోని వారే బయటకు రావాలంటూ లోకేశ్‌ హుకుం జారీ చేశారు.

కంగుతిన్న సంఘ పెద్దలు, పాస్టర్, మరికొందరు దళితులు ‘దేవుడి దగ్గరకు మీరు రారా.. దేవుడే మీ దగ్గరకు రావాల్నా’ అంటూ ప్రశ్నలు కురిపించడంతో అవాక్కయిన లోకేశ్‌ మాట మార్చి ఎన్నికల కోడ్‌ ఉన్నందున చర్చిలోకి రాలేనని చెప్పి వెనుతిరిగారు. అయితే అక్కడి నుంచి బేతపూడి వెళ్లిన లోకేశ్‌ కారు దిగి రామాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పక్కనే ఉన్న అనుచరుడు అక్కడ చర్చిలోకి వెళ్లలేదు కాబట్టి ఇక్కడ వెళ్లవద్దంటూ ఆపివేశాడు. అయితే ఇదే కోడ్‌ కొనసాగుతుండగా ఈ నెల 16వ తేదీన తాడేపల్లి మండలం గుండిమెడలోని వేణుగోపాలస్వామి ఆలయంలోపలికి ఎవరినీ అనుమతించకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని మరీ లోకేశ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయాన్ని దళితులు గుర్తు చేసుకున్నారు.

గుడిలోకి వెళ్లి పూజలు చేసినప్పుడు ఎన్నికల కోడ్‌ గుర్తుకు రాలేదా, చర్చిలోకి రమ్మంటే మాత్రం ఎన్నికల కోడ్‌ గుర్తు వచ్చిందా అంటూ దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను టీడీపీ నాయకులు చిన్నచూపు చూడడం, అవమానించడం అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు తమ మనసులో ఉన్న ద్వేషాన్నే దళితులపై చూపిస్తున్నారన్నారు. అది వారి తప్పు కాదని, తమను ఇంతగా అవమానిస్తున్నా ఇంకా టీడీపీలో ఉన్న దళితులే సిగ్గుపడాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement