సాక్షి, ముంబై : సోషల్ మీడియాలో ఇప్పుడు మహారాష్ట్ర మంత్రి గిరీశ్ దత్తాత్రేయ మహాజన్ చేసిన పని వైరల్ అవుతోంది. పిస్టోల్‌తో ఓ చిరుతను ఆయన వేటాడుతున్న దృశ్యాలవి. సోమవారం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆయన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
జలగావ్ జిల్లా ఛలీస్‌గావ్‌లో గత కొన్ని రోజులుగా ఓ చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళనలు రేపుతోంది. వరుసగా మనుషులు, పశువులను బలి తీసుకుండటంతో దానిని వేటాడేందుకు అటవీ శాఖ కూడా వేటగాళ్లకు అనుమతి ఇచ్చింది. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా ఎవరూ ఇంత వరకు దాని అంతు చూడలేకపోయారు. ఆ గ్రామం తన నియోజకవర్గం కిందకే రావటంతో స్వయానా మహాజనే రంగంలోకి దిగారు. సోమవారం అటుగా వెళ్తున్న ఆయన కాన్వాయ్ ఆపించి మరీ తన లైసెన్స్ రివాల్వర్‌తో చిరుతను వేటాడేందుకు యత్నించారు. అయితే అది వారికి చిక్కలేదు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రజా సంక్షేమం మాట పక్కనపెట్టి.. తనకు అవసరం లేకపోయినా మంత్రి ఇలా తుపాకీతో వేటాడం సరికాదన్న విమర్శలను కాంగ్రెస్ పార్టీనేతలు సహా పలువురు వినిపిస్తున్నారు. అయితే మంత్రి మాత్రం తన పనిని సమర్థించుకుంటున్నారు. కాగా, మహాజన్‌కు వివాదాలు కొత్తేం కాదు. మద్యం బ్రాండ్లకు మహిళల పేర్లు పెడితే అమ్మకాలు భారీగా పెరుగుతాయని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది ఈయనగారే. అంతేకాదు గతంలో ఓ వివాహ వేడకకు గన్‌తో దర్శనమిచ్చి కలకలమే రేపాయాయన.
Comments
Please login to add a commentAdd a comment