సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారంతో ఓ రాజ్యాంగ సంక్షోభానికి తెరపడింది. కానీ మొత్తం మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందా, పతనమైందా? ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ–శివసేన ఉమ్మడిగా హిందూత్వ ఎజెండాపై పోటీ చేశాయి. మొత్తం రాష్ట్రంలోని 288 అసెంబ్లీ సీట్లకుగాను 160 సీట్లను ఈ రెండు పార్టీలు కలిసి కట్టుగా గెలుచుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 145 సీట్లు అవసరం కాగా, ఏకంగా 160 సీట్లను గెలుచుకున్నాయి. 152 సీట్లకు పోటీ చేయడం ద్వారా బీజేపీ 105 సీట్లను, అంటే 70 శాతం విజయాన్ని, 124 సీట్లకు పోటీ చేయడం ద్వారా 56 సీట్లను, అంటే 40 శాతం సీట్లను శివసేన గెలుచుకుంది.
అంతేకాకుండా ఈ రెండు పార్టీల కూటమి 42 శాతం ఓట్లను దక్కించుకున్నాయి. రెండు కాంగ్రెస్ పార్టీలకు ఉమ్మడిగా 32.6 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఏవిధంగా చూసినా రాష్ట్ర ఓటర్లు బీజేపీ–శివసేన పార్టీల సంకీర్ణానికి సంపూర్ణ మెజారిటీని కట్టబెట్టారు. ప్రజాస్వామ్యబద్దంగా ఈ రెండు పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి పీఠం విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా అలా జరగలేదు. ఒకప్పుడు శివసేనకు చిన్న భాగస్వామ్య పార్టీగా బీజేపీ పోటీ చేయగా, ఇప్పుడు బీజేపీకి చిన్న భాగస్వామ్య పార్టీగా శివసేన పోటీ చేసింది. అంటే బీజేపీ ప్రాబల్యం పెరిగిపోయి శివసేన ప్రభవం పడిపోయింది. ఈ దశలో తామే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా తిరిగి పార్టీకి పూర్వ వైభవం తేవాలని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే భావించి ఉంటారు. అందుకే పొత్తు పొసగలేదు.
‘రాజకీయాలు సాధ్యమయ్యే ఓ కళ’ అని ఎప్పుడూ చెప్పే ఎన్‌సీపీ వ్యవస్థాపక నాయకుడు శరద్ పవార్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఇంతకంటే మరో అవకాశం ఉండదని కాంగ్రెస్ పార్టీ కూడా చేతులు కలిపింది. హిందూత్వ సిద్ధాంతానికి బద్ధ వ్యతిరేకులుగా చెప్పుకుంటున్న రెండు కాంగ్రెస్ పార్టీలు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా శివసేనతో చేతులు కలపడం ఎంతవరకు సమంజసం? దేశంలో అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే ఎన్‌సీపీ నాయకుడు అజిత్ పవార్‌కు జైలుకు పంపిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో సవాల్ చేసిన బీజేపీయే అజిత్ పవార్‌కు గాలం వేయడం ఏమిటో, శివసేనను ‘హఫ్తా వసూల్ పార్టీ’ అంటూ విమర్శించిన సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ అదే పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఏమిటో, 1961 నాటి చట్టం కింద సంక్రమించిన విశేషాధికారాలను అసాధారణంగా ఉపయోగించి ప్రధాని, రాష్టపతి పాలన ఎత్తివేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటో! వారికే తెలియాలి. బహుళ పార్టీ ప్రజాస్వామిక వ్యవస్థ కలిగిన భారత్‌లో నేడు విలువలెక్కడ ‘సోనియా’!
Comments
Please login to add a commentAdd a comment